సూర్యాపేట: ప్రజా సమస్యలు, రైతాంగ సమస్యలు, ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 26న సూర్యాపేట కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని ఆరోపించారు. అనేక గ్రామాలలో, మునిసిపాలిటీలలో ప్రత్యేక అధికారుల పాలనలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ కాల్వ పరిధిలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గంలో వేలాది గ్రామాలలో వరి పంట పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోయిన పంటలకు ఎకరాకు 30 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించడంలో జిల్లా అధికారులు ఘోరంగా వైఫల్యం చెందారని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాదులో 90 శాతం వడ్డీ మినాయింపు ఇచ్చి ఆస్తి పన్నును ప్రజల నుండి వసూలు చేస్తున్నారని మరో రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, నగర పంచాయతీలలో వడ్డీ మాపి లేకుండా మొత్తం ఇంటి పన్నును కట్టాలి మేడమ్ లో అర్థం లేదన్నారు. అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనులు ప్రారంభించి రోజు కూలి 600 ఇచ్చి 200 రోజులు పనులు కల్పించాలని కోరారు.
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వాలని కోరారు.
ఈ సమస్యల పరిష్కారం కోసం రేపు జరిగే కలెక్టరేట్ రైతులు, వ్యవసాయ కార్మికులు, పేదలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.