Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ప్రత్యేక కథనం

వృక్షో రక్షతి రక్షితః

అక్షరాలు ఒక్కోసారి ఆహ్లాదంగా పరుగులు పెడతాయి, మరొకసారి నిరాహార దీక్షకు దిగుతాయి, పలకరింపుల్లో పచ్చదనాన్ని కురిపిస్తాయి, అలాగే ప్రశ్నిస్తూ రుధిరాన్ని మరిగిస్తాయి, ధరణి నిండుగా, గగనాన్ని ఏలుతూ, గంభీరపు గొంతుతో సమస్తాన్ని నిలదీస్తాయి, తమ స్వేచ్ఛకు అడ్డువస్తే పర్యావరణాన్ని తనలో నింపుకుని ప్రళయాన్ని పుట్టిస్తాయి…

అలాంటివే మన రచయిత రామారావు గారి రచనలు, ఆకాశాన పుట్టిన ఇంద్రధనస్సులా, చక్కని నేర్పరిదనంతో, హుందాగా, లోలోన దాగిన మనసు భావాలకు రూపాన్ని ఇస్తూ, చెప్పకనే నిజాన్ని సున్నితంగా చెప్తూ, భావుకత్వాన్ని అక్షరాల్లో ఒలికిస్తూ, నిడారంబరంగా నిలదీస్తాయి అతని అక్షరాలు…

అమ్మ పుస్తెలతో ఆడుతూ చనుబాలు తాగుతున్న పసిపిల్లాడి పసి నవ్వులా,పరవళ్ళు తొక్కుతున్న కెరటాల హొయలులా,కమ్మగా,నిమ్మళంగా ,అర్థవంతంగా,అణకువగా ఉంటాయి మన కవి రచనలు…

 

ఇక కవిత్వం విషయానికి వస్తే

*******

స్వయంకృతాపరాధం

 

పచ్చదనాన్ని తుంచిన పాపం

పెరిగిన భూతాపమై వెంటాడుతోంది

ధన దాహపు గొడ్డలి వేటుకి

భావి జీవనం కూలుతోంది

 

దురాశతో నీవు సాగించే అరణ్యహననం

వారసుల జీవితాలను చేస్తుంది ఛిద్రం

పెంచే బాధ్యత లేనప్పుడు

తుంచే హక్కు కూడా ఉండదు

 

ఒక్కొక్క చెట్టు నరుక్కుంటూ పోతే

రేపటి రోజు నీకే ఊపిరి ఆడదు

ప్రాణవాయువు సరిపోక మనుషులు పిట్టలా రాలిపోవడం నీకు అనుభవమేగా

 

నీ దేహంలో శ్వాస సమస్య అయితే

మహమ్మారి వ్యాధులు విజృంభించవా

రహదారికి అడ్డం వస్తే తరువులను తరగడమేనా న్యాయం

 

మొక్కలు కూడా నీతోటి జీవులే

నీకు చేయూతనందించే కుటుంబ సభ్యులే

పసిపాపలా అంకురాన్ని నీవు పోషిస్తే

రేపు అదే వటవృక్షమై నీకు జోల పాడుతుంది

 

కాలుష్యపు గరళాన్ని అడ్డుకుని

నీలకంఠుడిలా నిన్ను కాపాడుతుంది

మేఘాలకు ఆహ్వానం పంపి

చల్లని చినుకై నీకు దాహం తీరుస్తుంది

కమ్మని నిద్రను నీకు అందిస్తుంది…

 

రచయిత : పల్లా వెంకట రామారావు

*****

భూతల్లి కన్నబిడ్డల్లా పెరిగిన వృక్షాలను కూకటి వేళ్ళతో సహా పెకిలిస్తున్నారు,

ధన దాహపు గొడ్డలి వేటుకి భవిష్యత్తు తరాలు అంతం అవుతాయని తెలియడం లేదా అంటూ రచయిత ఎంతగానో వాపోతున్నారు…

 

దురాశతో నీవు సాగించే అరణ్య హసనం వారసుల జీవితాలను చిత్రం చేస్తుంది, మొక్కలు నాటే బాధ్యత నీకు లేనప్పుడు, తుంచే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది..!?

ఒక్కొక్క చెట్టును నరుక్కుంటూ పోతే రేపటి రోజున ప్రాణవాయువు ఉంటుందా…!?

ఈ పాపానికి ప్రతి మనిషి ఆయువు పిట్టలా రాలిపోవడం తెలిసిందే కదా అంటూ గత కాలపు జ్ఞాపకాలను నెమరువేస్తూ అలాంటి పరిస్థితి మనకు రాకూడదు అని ఎంతో ఆవేదనతో రచయిత తన కలం నుంచి అక్షరాలను కురిపిస్తున్నారు…

 

ఒక మనిషి జీవితంలో శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఎదురైతే, ఎన్ని రకాల మహమ్మారులు ఆ శరీరాన్ని చుట్టుముడతాయి…!?

రహదారికి అడ్డం వస్తే తరువులను తెగ నరకడమేనా న్యాయం..!?

 

మొక్కలు కూడా నీతో సమానమైన జీవాలే, చేయూతనందించే బంధువులే, వృక్షాన్ని నీవు పసిపాపలా చూడగలిగే – రేపు అదే మహావృక్షమై నీకు సేద తీరడానికి కాస్త స్థానం ఇస్తుంది…

 

వాతావరణంలో జరుగుతున్న కాలుష్య బీభత్సాన్ని అడ్డుకుని, నీలకంఠుడిలా నిన్ను కాపాడుతుంది, మేఘాలను పిలిపించి చల్లని చినుకులు కురిపించి దాహం తీరుస్తుంది, కమ్మని నిద్రను ఇస్తుంది…

అంటూ తరువులను మనం కాపాడటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో అతిశయోక్తి లేకుండా ఎంతో అద్భుతంగా వివరించి చెప్పారు రచయిత రామారావు గారు…

 

ఇలానే సమాజానికి ఉపయోగపడే మరెన్నో రచనలు చేస్తూ మీ కలంతో ప్రశ్నిస్తూ, పరామర్శిస్తూ, నిజాన్ని చూపిస్తూ, జనుల మనసులను మారుస్తూ, మరెంతో గొప్ప స్థానాన్ని మీరు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా…

******

సమీక్షకురాలు : పోలగాని భాను తేజశ్రీ

Related posts

మాయమైపోతున్నాడు…మనిషి

తొర్రూర్ బస్టాండ్ ఆవరణంలో ఆర్టీసీ విజయోత్సవాలు  బస్టాండ్ లోపల సిసి కెమెరాలు లేని వైనం  విజయోత్సవాలు కాదు అభివృద్ధి కావాలి  విజయోత్సవాలు ఫ్లెక్సీల పై కాదు 

TNR NEWS

మనుషులే కాదు… జంతువులు కూడా వాటి కోరికలు కోసం దేవుడిని వేడుకుంటాయి అలాంటి దృశ్యం….కెమెరా కళ్ళకు చిక్కింది… శివలింగానికి ఓ శివయ్య నా మాట వినయ్యా…. అని మొక్కుతున్న వానరం

TNR NEWS

నిగూఢ నిర్ణయం – విజయానికి తొలి పదం

Dr Suneelkumar Yandra

టోక్యో (జపాన్)లో . పర్యటించిన స్పీకర్ ప్రసాద్ కుమార్.

TNR NEWS

విస్తరాకు ….. మనిషి జీవితం

TNR NEWS