మోతే : పెద్దమ్మ, డబల్ బెడ్ రూమ్ కాలనీలలో నెలకొన్న మౌలిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. శనివారం మోతే మండల కేంద్రంలో సిపిఎం పోరుబాటలో భాగంగా పెద్దమ్మల కాలనీ, డబల్ బెడ్ రూమ్ కాలనీలలో నెలకొన్న ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దమ్మల కాలనీలలో 40 కుటుంబాలకు పైగా పెద్దమ్మల వృత్తి చేసుకునే గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాయని వారికి సొంత ఇల్లు లేక చీరలు చుట్టుకొని నివాసం ఉంటున్నారని అన్నారు. వీరికి ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలన్నారు. కాలిని లలోమురికి కాలువలు, మరుగుదొడ్లు లేకపోవడంతో దోమలు, ఈగలు వృద్ధి చెంది ప్రజలు అంటువ్యాధులు, విష జ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే స్తంభానికి 40 కరెంటు లైన్లు తీయడం మూలంగా కరెంటు డిమ్ము రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం తక్షణమే ఒక ట్రాన్స్ ఫారం ఏర్పాటు చేసి స్తంభాలు పాతి వైర్లు కలపాలన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో సిసి రోడ్లు లేకపోవడంతో బజార్లలో నీళ్లు నిలువ ఉండటం వల్ల రోడ్లు బురదమయం కావడంతో వృద్ధులు, పిల్లలు నడిచే పరిస్థితి లేదన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో కనీస సౌకర్యాలైన త్రాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి సౌకర్యాలు వెంటనే కల్పించాలన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న మోతే తాసిల్దార్ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో ని వీధుల్లో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి మండల కమిటీ సభ్యులు గుంట గాని ఏసు, శాఖ కార్యదర్శి దోసపాటి శ్రీనివాస్, నాయకులు తురుక నాగమ్మ, దోసపాటి చిన్న శ్రీను, మేకల జగ్గయ్య, శoబయ్య, కోట రమేష్, పోశయ్య, రాములు, అనసూర్య, జ్యోతి, సమ్మక్క, కోటయ్య పాల్గొన్నారు.