హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ భూముల వేలంపాటను ఆపాలని ప్రశ్నించిన విద్యార్థుల, సిపిఎం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఏత్తివేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు,విద్యార్థుల అక్రమ అరెస్టులను నిరసిస్తూసిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం మోతే మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంచా గచ్చిబౌలిలోని 400 ఎకరాల యూనివర్సిటీకు సంబంధించిన భూములను ప్రభుత్వం వేలంపాటను తక్షణమే ఆపి విశ్వవిద్యాలయానికి భూములను అప్పగించాలని డిమాండ్ చేశారు. భూమిలోకి కార్పొరేట్ శక్తులు ప్రవేశిస్తే పర్యావరణం దెబ్బతింటుందని జీవ వైవిధ్యం నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నూతన భవనాలు వసతి గృహాలు కోర్సులు తదితర అనేక అవసరాలకు ఉపయోగపడే భూములను విశ్వవిద్యాలయానికే కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ప్రజల న్యాయమైన డిమాండ్ ను ఆలోచన చేయకుండా ప్రశ్నించిన విద్యార్థులను రాజకీయ పార్టీలను నిరంకుశంతో అణచివేస్తుందని విమర్శించారు.యూనివర్సిటీకి సంబంధించిన భూముల పై ప్రభుత్వం అడుగుపెట్టి అర్హత లేదని అన్నారు. భవిష్యత్తు లో విశ్వవిద్యాలయాలను పరిశోధన కేంద్రాలుగా మార్చి అభివృద్ధి చేయడం మానేసి యూనివర్సిటీలలోకి ప్రభుత్వం కార్పోరేట్ శక్తులను ప్రోత్సహించడం ఏమిటి అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని 400 ఎకరాల భూమి హెచ్ సి యు కు అప్పగించాలని, రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా అరెస్టు చేసిన సిపిఎం నాయకత్వాన్ని విడుదల చేసి విద్యార్థులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలను కలుపుకొని దీర్ఘ కాల ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు గుంట గాని ఏసు, సోమ గాని మల్లయ్య, బానోతు లచ్చిరాం నాయక్, నాయకులు బానోతు వెంకన్న, చెరుకు శ్రీను, ఒగ్గు సైదులు, కోడి లింగయ్య, బానోతు పాప, వొల్లోజు ఉపందర్, బానోతు హైమ్లా నాయక్, వల్లోజు లింగరాజు, బానోతు రమేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.