- పీఠాధిపతి – డాక్టర్ ఉమర్ ఆలీషా
పిఠాపురం, ఫిబ్రవరి 11 : సామాన్యుని మొదలుకొని తత్వవేత్తల వరకూ కాలం అందరినీ పరీక్ష పెడుతుందని కాల పరీక్షకు ఎవరూ అతీతులుకారని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. పీఠం 98వ వార్షిక జ్ఞాన మహాసభల ముగింపు సందర్భంగా బుధవారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల పీఠం ప్రధాన ఆశ్రమం వద్ద జరిగిన సభలో ఆలీషా సభ్యులకు అనుగ్రహ భాషణ చేసారు. తాత్వికులు యోగులు అందరూ కాలగమనంతో ప్రయాణం చేసిన వారేనని అన్నారు. కాలానికి అతీతంగా ప్రయాణించే జీవి ఏదీ ఈ సృష్టిలో లేదని వెల్లడించారు. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా కాలం పెట్టే పరీక్షలను తట్టుకునే శక్తి మానవుడికి లభిస్తుందని అన్నారు. అసూయ, ద్వేషం, పగ, దుష్టత్వ భావాలు, మానవ జీవన వ్యవస్థను అస్త వ్యస్తం చేయడం వలన మానవత్వం అంతరింప చేసే మృగాలుగా మానవులు మారిపోతున్నారని ఆధ్యాత్మిక, తాత్విక అమృతం పొందడం ద్వారా మానవత్వ పరిమళాలు సమాజంలో విస్తరింప చేయాలని ఆలీషా సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పీఠం చేపట్టిన “నా మొక్క – నా శ్వాస” కార్యక్రమంలో ప్రతి సభ్యుడూ పాల్గొని తమ వంతుగా ఒక్కో మొక్కను నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. నాటే ప్రతి మొక్కా ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ తో సమానమని అన్నారు. అనంతరం తత్వమార్గం ఆధ్యాత్మిక డైరీ, ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ బ్రోచర్, సమాచారదర్శిని తెలుగు, హిందీ బ్రోచర్, నూతన సభ్యులకు సమాచారం బ్రోచర్ లను ముఖ్య అతిథుల సమక్షంలో పీఠాధిపతి సభలో ఆవిష్కరించారు. సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన పిఠాపురం మాజీ శాసనసభ్యుడు ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ మాట్లాడుతూ మానవుడు గురువును ఆశ్రయించి భ్రాంతిశక్తులను తొలగించుకున్నప్పుడు తనలోని పరమాత్మను దర్శించు కోగలుగుతాడని తెలిపారు. సూఫీ తత్వ వేత్తలైన ఈ పీఠాధిపతులు జ్ఞాన మహా సభల ద్వారా బ్రహ్మ విద్య నేర్పుతూ విశ్వ మానవ శ్రేయస్సు కొరకు పాటుపడుతున్నారని కొనియాడారు. పీఠాధిపతి ద్వారా తాత్విక జ్ఞానాన్ని పొందిన శిష్యులు ఆ జ్ఞానాన్ని మరింత మందికి పంచాలని సూచించారు. నా మొక్క నా శ్వాస పేరుతో పీఠం సభ్యులతో మొక్కలు నాటిస్తూ వాటిని సంరక్షిస్తూ అహర్నిశలు పర్యావరణ పరిరక్షణ కొరకు విశేషంగా కృషి చేస్తున్న పీఠాధిపతి సేవలను కొనియాడారు. అనంతరం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లు, రెడ్ క్రాస్ గ్రీన్ ఫీల్డ్ బ్లైండ్ స్కూల్ విద్యార్థులు మరియు కాకినాడ ఉమా మనోవికాశ కేంద్రం విద్యార్థులకు స్కాలర్షిప్స్, పక్షుల ఆహారం కొరకు తయారు చేసిన ధాన్యపు కుచ్చులను సభలో పంపిణీ చేశారు. సభలో పాల్గొన్న అహ్మద్ అలీషా, పింగళి ఆనంద కుమార్, జి.రామ ప్రసాద్, షేక్.అమీర్ భాషా, యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ గురువును ఆశ్రయించి గురుపథంలో పయినించి జ్ఞాన సాధన చేయువారికి ఆత్మతత్వం తెలియబడుతుందని తెలిపారు. తాత్విక జ్ఞానం పొందడం ద్వారా మనసు శుభ్రపడుతుందని పేర్కొన్నారు. మానవుడు బ్రాంతి శక్తుల నుండి బయటపడాలంటే పీఠాధిపతి అందిస్తున్న ధ్యాన, జ్ఞాన, మంత్ర శక్తులతో కూడిన త్రయీ సాధనను అవలంబించాలని పేర్కొన్నారు. పీఠం నిర్వహిస్తున్న తాత్విక బాలవికాస్ ద్వారా ఆధ్యాత్మిక తరగతుల్లో శిక్షణ పొందిన చిన్నారుల ప్రసంగాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సినీ దర్శకుడు వంశీ కృష్ణ, సినీ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ దంపతులు, పెద్దాపురం ఆర్డిఒ కె.రమణి, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షుడు ఎగ్గిన నాగబాబు, ఆర్టిఎ మెంబర్ చింతా ఉమామహేశ్వరి, జి.వి.ఎస్.కె. ఫార్మా అధినేత డాక్టర్ కిషోర్ కుమార్ దంపతులు, బౌద్ధ మత ప్రతినిధి రత్నం, కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాస్ అలియాస్ గున్ని, తదితరులు పీఠాధిపతిని దర్శించుకున్నారు. సభలో నిర్వహించిన సంగీత విభావరిలో సినీ నేపథ్య గాయని సి.హెచ్.లావణ్య, అంధ విద్యార్థినులు మరియు ఎ.ఉమ బృందం ఆలపించిన కీర్తనలు సభికులను రంజింప చేసాయి. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు, ఎ.వి.వి.సత్యనారాయణ, ఎన్టీవీ వర్మ, స్వర్ణలత, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
