ఖరీఫ్ లో రైతులు పండించిన వరి ధాన్యానికి ప్రైవేటు వ్యాపారస్తుల నుంచి కూడా గిట్టుబాటు ధర కల్పించాలని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సామాజిక సేవ కార్యకర్త గంధం సైదులు ప్రభుత్వాన్ని కోరారు. అకాల వర్షాలతో ఒకవైపు పంటలకు విపరీతమైన పురుగుమందులు వాడి రైతులపై అధిక మొత్తంలో ఆర్థిక భారం పడిందన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ తేమ శాతం పేరుతో మ్యాచర్ వచ్చాకే తీసుకొని రమ్మని చెబుతుండటంతో కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్ళలేక రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది అన్నారు. దీనివల్ల రైతులు అట్టి ధాన్యాన్ని ఆరబోసుకోలేక ప్రైవేటుకు తరలిస్తున్నారని, దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ. 1600 నుంచి 2000 వరకే ధర నిర్ణయిస్తున్నారన్నారు, చేసేది లేక రైతులు పచ్చి వడ్లనే ప్రైవేటు వ్యాపారులు కే తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.కొన్నిచోట్ల ప్రైవేటు వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధరకే ధాన్యాన్ని కొనాలని తోటి వ్యాపారులకు చెప్పి రైతుల వద్ద ఒడ్లు కొనక పోవడంతో కోసిన ఒడ్లు ఎక్కడ ఆగమైపోతాయని రైతులు వారు నిర్ణయించిన ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మార్కెట్లో రేటు కూడా లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు కూడా ధాన్యాన్ని కొనేందుకు ముందుకు రావడం లేదని రైతులు తెలుపుతున్నారని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించి పచ్చి ధాన్యానికి కూడా ప్రైవేటు వ్యాపారుల వద్ద మద్దతు ధర ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.