తల్లిదండ్రులు తమ పిల్లలకు సనాతన ధర్మంపై అవగాహన కల్పించాలని జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామి సూచించారు. మెట్ పల్లి పట్టణంలోని శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని బుధవారం స్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి స్వామి మాట్లాడారు. హిందు బంధువులంతా తమ పిల్లలకు ప్రతిరోజూ నుదుటన కుంకుమ పెట్టాలని, ఆడపిల్లల చేతులకు గాజులు తొడగాలని అన్నారు. ప్రతిరోజు సమీపంలోని ఏదో ఒక గుడికి వెళ్లి నమస్కరించేలా పిల్లలకు అలవాటు చేయాలని పేర్కొన్నారు. చిన్నతనం నుంచి పిల్లలకు భక్తి భావాన్ని అలవాటు చేస్తే సనాతన ధర్మం పటిష్టంగా ఉంటుందని అన్నారు. సనాతన ధర్మం పాటించే పిల్లలు గురువుల పట్ల, పెద్దల పట్ల గౌరవభావం తో ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు ద్యావనపెల్లి రాజారాం, ఉపాధ్యక్షులు శంకు ఆనంద్, అన్నం నాగరాజు, గుంటుక గౌతమ్, భీమనాథ్ సత్యనారాయణ, భాస్కర్, పట్టణంలోని పద్మశాలి వార్డు సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.