సూర్యాపేట: జనవరి 25 నుండి 28 వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే సిపిఎం పార్టీ రాష్ట్ర మూడవ మహాసభల సందర్భంగా ఈనెల 20 నుండి 24 వరకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా జరిగే ఇంటింటికి సిపిఎం కు ప్రజలంతా సహకరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గం సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక కార్మిక పోరాటాలకు నిలయమైన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని అన్నారు. ఈ మహాసభలో రాష్ట్రంలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మిలు, మహిళలు, విద్యార్థులు, యువజనులు, చేతి వృత్తుదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అనేక తీర్మానాలు చేరినట్లు చెప్పారు. ఈ మహాసభ సందర్భంగా జనవరి 25న లక్షలాది మందితో భారీ బహిరంగ సభ జరుగుతుందని ఈ సభకు సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ హాజరవుతున్నారని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో దేశ ప్రజానీకానికి చేసింది ఏమి లేదన్నారు. 10 సంవత్సరాల బిజెపి పాలన మహిళలకు, దళితులకు, బలహీన వర్గాలకు ముస్లిం మైనార్టీలకు రక్షణ కరువైంది అన్నారు. ఐక్యంగా ఉన్న దేశంలో ప్రజల మధ్య మత విద్వేషాలను బిజెపి రెచ్చగొడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని కోరారు. రుణమాఫీ నేటికీ పూర్తి కాలేదని, రైతు భరోసా నిధులు విడుదల చేయలేదన్నారు. వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12,000 ఇస్తామని చెప్పిన హామీ అమలు నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు గురించి రాష్ట్ర మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు.