- ఫ్రీ భోజనం కోసం ఎక్కడ పడితే అక్కడే బస్సు నిలుపుదల
- ప్రశ్నించిన ప్రయాణికుడిపై దుర్భాషలు
- దొమ్మేరు రాజు గారి హోటల్ తో ఆర్టీసీ అధికారులు కుమ్మక్కు
- మధురవాడ ఆర్టీసీ డిపో అధికారుల నిర్వాహకం
అనకాపల్లి : నిత్యం ఎంతో మందిని గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేస్తూ… అందరి మన్ననలు పొందుతున్న ఆర్టీసీ వ్యవస్థ కొందరు కండక్టర్, డ్రైవర్ల నోటి దురుసుతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. మధురవాడ డిపోకు చెందిన AP09 4723 నెంబర్ గల సూపర్ లగ్జరీ బస్సు విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్తుంది. ఇందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భోజన సమయం కావడంతో కండెక్టర్ని భోజనం చేయడం కోసం బస్సు ఎక్కడైనా ఆపమని సుమారు మధ్యాహ్నం 2 గంటలకు అడగగా… బస్సు ఎక్కడపడితే అక్కడ ఆపడం కుదరదని మా డిపోకు సంబంధించి అనకాపల్లి దాటిన తరువాత జాతీయ రహదారి పై దొమ్మేరు రాజు గారి హోటల్ మన డిపో మేనేజర్ గారిది ఉందని, అక్కడ భోజనం చేయడం కోసం బస్సు ఆపడం జరుగుతుందన్నాడు. అక్కడ భోజనం చాలా అద్భుతంగా ఉంటుందని ఆ కండక్టర్, డ్రైవర్ సర్టిఫికేట్ ఇవ్వడం గమనార్హం. తీరా అక్కడ బస్సు ఆగాక అక్కడ వాతావరణం ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా ఉందని, ఇంకెక్కడైనా మంచి హోటల్ దగ్గర ఆపమని మహిళా ప్రయాణికులు డ్రైవర్ని అడిగితే ఇష్టం ఉంటే ఇక్కడ తినండి… లేకుంటే మానేయండి.. బస్సు ఇంకెక్కడా ఆపడం కుదరదని మీకు చేతనైంది చేసుకోమని ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు దుర్భాషలాడాడని మహిళా ప్రయాణికులు వాపోయారు. కనీసం సౌచాలయాలు కూడా లేవని, అవి ఉన్న చోట ఆపమని అడిగితే ఆమాత్రం అగలేరా అని మహిళా ప్రయాణికులతో వ్యంగ్యంగా కండక్టర్ మాట్లాడటం చాలా బాధించిందన్నారు. ఒక ప్రక్క కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుంటే ఆర్టీసీలో మాత్రం చులకనగా చూస్తున్నారని మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆ సమయంలో డ్యూటీలో ఉన్న బస్సు డ్రైవర్, కండక్టర్, డిపో మేనేజర్ పై అధికారులు విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇటువంటి చర్యలు పునరావృత్తం అయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ లకు సరైన బుద్ధి మా మహిళలే చెబుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు.