హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆమె మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో సంచలన కామెంట్లు చేశారు. హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతోందని అన్నారు. హరీష్‌రావు ట్రబుల్ షూటర్ కాదని, డబుల్ షూటర్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన ప్రాణం పోయినా కేసీఆర్‌కు అన్యాయం జరగనివ్వనని స్పష్టం చేశారూ
- వేరే పార్టీలో చేరికపై క్లారిటీ
కవిత వేరే పార్టీలో చేరుతుందంటూ జరుగుతుందన్న ప్రచారంపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరనని, తనకు ఏ పార్టీతో పనిలేదని స్పష్టం చేశారు. జాగృతి కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడాకే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. గొడవల నేపథ్యంలో అమ్మకు కూడా దూరంగా ఉండాల్సి రావడం బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
- నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
తన 20 ఏళ్ల జీవితాన్ని బీఆర్ఎస్, తెలంగాణ కోసం పనిచేయడానికి వెచ్చించానని, సస్పెన్షన్‌పై మరోసారి ఆలోచించాలని కవిత కోరారు. అయినా తనకు ప్రజలున్నారని, వాళ్ల దగ్గరికే వెళ్తానని చెప్పారు. బీఆర్ఎస్ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత అని తాను అనలేదని, కేసీఆర్‌కు నష్టం చేసే పార్టీ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత అన్నానని వెల్లడించారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను ఓడించేందుకు ప్రత్యర్థులకు హరీష్‌రావు డబ్బు పంపారన్నారు. పోచంపల్లికి మోకిలాలో వందల కోట్ల ప్రాజెక్ట్ వచ్చిందని, హరీష్‌రావు, సంతోష్ బీఆర్‌ఎస్‌ను జలగల్లాగా పట్టిపీడిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీతో ఇద్దరూ అంటకాగుతున్నారన్నారు. సంతోష్‌రావు బాధితులు చాలా మంది తనకు ఫోన్ చేస్తున్నారని చెప్పారు.