కాకినాడ : భగవంతుడు ప్రసాదించిన మరో బాల్య దశ వృద్దాప్యం అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. ఏపి స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కాకినాడ వారి ఆధ్వర్యంలో స్థానిక ఫెన్షనర్స్ భవనంలో శుక్రవారం ఉదయం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా స్వామి మరియు కాకినాడ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ముఖ్య అతిథులుగాను, సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.ఎస్.ఎస్.ఎన్.పి.శాస్త్రి, సంఘ జిల్లా అధ్యక్షుడు కె.పద్మనాభం, ప్రధాన కార్యదర్శి టి.నూకరాజు, కోశాధికారి వి.శేషగిరి వేదికపై ఆశీనులై ప్రసంగించారు. ఈ సందర్భంగా 9 మంది రిటైర్డ్ ఉపాధ్యాయులను ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా సత్కరించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా స్వామి మాట్లాడుతూ వృద్ధాప్యం అనేది భగవంతుడు ప్రసాదించిన మరో బాల్య దశగా అభివర్ణించారు. మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అని మన భారతీయ సంస్కృతి తెలియ చేస్తోందని, కావున తల్లితండ్రుల తర్వాత గురువును గౌరవించి పూజించవలెను అన్నారు. వృద్దాప్యంలో భగవతత్త్వo వైపు అంటే ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తే, శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ ఉపాధ్యాయులను అభినందిస్తూ కవిత చదివారు. ఉపాధ్యాయులు పిల్లల భవిష్యత్తుకు నిర్దేశకులు అని అన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి, డా. సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటోకు పుష్ప మాల వేశారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కాకినాడ డా ఉమర్ ఆలీషా స్వామి వారికి, కాకినాడ కర్రి పద్మశ్రీ, శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, మరికొందరు రిటైర్డ్ టీచర్లను సత్కరించారు.