సూర్యాపేట: తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన కందాల శంకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గురువారంఒక ప్రకటనలో తెలిపారు. ఈయన గతంలో విద్యార్థి, యువజన సంఘాలలో పనిచేశారు. గత 35 సంవత్సరాలుగా ప్రజాతంత్ర ఉద్యమంలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్నారు. అనేక కేసులు, నిర్బంధాలను, శత్రువుల దాడులను తట్టుకొని ఉద్యమానికి అంకితమై ప్రజాతంత్ర ఉద్యమ బలోపేతానికి ఎంతో కృషి చేశారు.1983లో ఖమ్మం జిల్లా గోకినపల్లిలో జరిగిన ఎస్ఎఫ్ఐ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులలో పాల్గొని దాని స్పూర్తితో ప్రజా ఉద్యమాలలో అంకితమై పనిచేస్తున్నారు. అమరవీరులు తొట్ల మల్సూర్, కందాల మల్లారెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రజా ఉద్యమాలలో భాగస్వామ్యం అవుతూ రైతులకు గిట్టుబాటు ధర కోసం, ఐకెపిలో నెలకొన్న సమస్యలపై, అకాల వర్షాలు,వరదలు, వడగళ్ల వానలు, యూరియా కొరత వంటి రైతాంగ సమస్యల పరిష్కారం కోసం అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. తన ఎన్నికకు సహకరించిన తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.
