నల్గొండ టౌన్:
వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఐఏఎస్ అధికారి ప్రతీక్ జైన్ పై దాడి సంఘటనను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బుధవారం నల్లగొండలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక ఐఏఎస్ అధికారిపై దాడి చేయడం సిగ్గుచేటు అని అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం కలెక్టర్ ను పిలిపించి దాడికి పాల్పడ్డారని, ఇది దేశంలోనే ఘోరమైన సంఘటన అని అన్నారు. కాలేశ్వరం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ వంటి అవసరం లేని ప్రాజెక్టులకు భూసేకరణ జరిగినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగినా ప్రభుత్వాన్ని బ్రతిమిలాడారే తప్ప ఏ రోజు దాడులకు పాల్పడలేదని, అలాంటిది ఈరోజు ఒక జిల్లా కలెక్టర్ పైన దాడికి దిగడం దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, మేధావులంతా తీవ్రంగా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది దురదృష్టకరమైన సంఘటన, ఈ సంఘటన వెనక ఎంత పెద్దవారు ఉన్నా సరే క్షమించేది లేదని, ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తున్నామని,ఒక మంచి ఐఏఎస్ అధికారని, నక్సలైట్ ఏరియాలో గిరిజనులకు సేవలందించిన వ్యక్తిగా మంచి పేరు ఉందని,అలాంటి అధికారి పై ఇలా దాడి చేయడం సబబు కాదన్నారు. ఈ సంఘటనపై నివేదిక వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో చర్యలు చేపడతామన్నారు.అధికారం కోల్పోవడంతో ప్రెస్టేషన్లో టిఆర్ఎస్ నేతలు ఇలాంటి దాడులకు ప్రోత్సహిస్తున్నారు దాడికి పాల్పడిన నేతలు ఫోన్లో కేటీఆర్ తో కూడా టచ్ లోనే ఉన్నారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.