సాహితీ సంస్థల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
విశాఖపట్టణం : రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ మరియు సోమ సుందర్ లిటరరీ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్టణంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో అభ్యుదయ సాహితీవేత్త, యువ రచయిత, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కిలారి గౌరీ నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరీ నాయుడు అతిథి ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో గౌరీ నాయుడు మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని, ఆర్థికంగా ఎదగాలని, జాతీయ అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటేలా మహిళను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలు వివిధ రంగాలలో రాణించటానికి అవకాశాలను కల్పించాలని తెలియజేశారు. ప్రతి కుటుంబంలో మహిళలు ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలని ఆత్మీయ అతిథి ప్రసాద్ వర్మ సూచించారు. కార్యక్రమ కన్వీనర్ వెంకటరత్నం మాట్లాడుతూ ప్రతి ఇంట్లో తల్లి ,భార్య, అక్క, చెల్లి, కూతురు ప్రతి ఒక్కరూ తమ హక్కుల కోసం మాట్లాడే స్వేచ్ఛను సమాజం కల్పించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు నిర్వహించిన సాంస్కృతిక పోటీల విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఇందులో భాగంగా నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో సాహితీ సంస్థల ప్రతినిధులు గాయత్రీ దేవి, వెంకటరత్నం, వరలక్ష్మి, మానస, సుహాసిని, చంద్రిక, దీప్తి, సాహితీ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కరుణ కుమారి వందన సమర్పణ తో ఈ కార్యక్రమం ముగిసింది.