Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

గత అయిదేళ్లలో బూతులు, బెదిరింపులు – కూటమి ప్రభుత్వంలో ఆటలు, నాటికలు

  • శాసన సభ్యులు, మండలి సభ్యుల్లో ఐక్యత, పోరాట పటిమకు క్రీడా, సాంస్కృతిక పోటీలు ఉపయోగం

 

  • ఇదే సమష్టి స్ఫూర్తితో రాష్ట్రాభివృద్దిలో భాగస్వాములవుదాం

 

  • సభ్యుల క్రీడ, సాంస్కృతిక స్ఫూర్తి చూశాక జస్ట్ వావ్… అనిపించింది

 

  • శాసనసభ్యుల, మండలి సభ్యుల సాంస్కృతిక పోటీల అనంతరం క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం

 

  • కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొని.. ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

 

విజయవాడ : గత అయిదేళ్లలో శాసన సభ్యులంటే బెదిరింపులు, బూతులు అనే ధోరణిని చూశారు… ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి శాసన సభ్యుల్లో ఓ సుహృద్భావ వాతావరణం, సోదరభావం పెంపొందించేందుకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం శుభ సంప్రదాయం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఐక్యతతో, పోరాట పటిమతో, సమష్టిగా ముందుకు సాగడానికి ఈ పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. రెండు రోజులుగా సాగిన క్రీడా పోటీలు, గురువారం సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో శాసనసభ్యుల పెర్ఫామెన్స్ చూసిన తర్వాత జస్ట్ వావ్… అనిపించిందని చెప్పారు. శాసన సభ, శాసనమండలి బడ్జెట్ సెషన్ ముగింపు వేళ శాసన సభ్యులకు, శాసనమండలి సభ్యులకు రెండు రోజుల పాటు క్రీడా పోటీలు, గురువారం సాయంత్రం విజయవాడలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని క్రీడా పోటీల విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రకాల వేషాలు, ఏకపాత్రాభినయాలు, స్కిట్లతో అలరించారు. కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ఆసాంతం ఎంజాయ్ చేశారు. చప్పట్లతో తోటి శాసనసభ్యులను, మండలి సభ్యులను ప్రొత్సహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కనే ఆశీనులై కామెడీ స్కిట్లు చూసి మనసారా నవ్వుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ శాసన సభ్యుల కామెడీ స్కిట్లు చూస్తే నా గబ్బర్ సింగ్ సినిమా పోలీస్ స్టేషన్ సీన్ గుర్తుకువచ్చిందని, మనసారా నవ్వుకున్నాను అన్నారు. చాలా రోజులపాటు తల్చుకొని మరీ నవ్వుకునేంత ఎంజాయ్ చేశానన్నారు. ఇదో అద్భుతమైన రోజు. ముఖ్యంగా శాసనసభలో ఎస్సీ వర్గీకరణ మీద తీర్మానం చేసి పంపిన రోజు. చంద్రబాబు చొరవ, మంద కృష్ణ పోరాటం స్ఫూర్తితో సుమారు 3 దశాబ్దాల పోరాటానికి విజయం సాధించిన ఈ రోజున ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా అభినందనీయం అన్నారు.

 

  • చంద్రబాబు తనివితీరా నవ్వడం చూశాను

 

ఎప్పుడూ పాలన, భవిష్యత్తు మీద ఆలోచనలతో గుంభనంగా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా రోజులు తర్వాత మనసారా నవ్వడం చూశానని, ఒక శాసనసభ్యుడికే బోలెడు పనులు, సమస్యలు ఉంటాయి. అలాంటిది ఓ రాష్ట్రాన్ని మొత్తం చూసుకోవల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి నిత్యం ఆలోచనలతోనే ఉంటారు. గుంభనంగా ఉండే ఆయన మోముపై నవ్వుల పువ్వులు పూయించిన శాసన సభ్యులకు, మండలి సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇలాంటి సత్సంప్రదాయం మనలో ఐక్యతను నింపుతుంది. వేర్వేరు పార్టీల నుంచి వచ్చిన సభ్యులుగా ఒకే కూటమిలో ఉన్న మనకు ఇలాంటి పోటీలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి అన్నారు. ఇలాంటి సంప్రదాయం ఎల్లపుడూ కొనసాగాలి. శాసనసభ్యుల్లో ఉన్న ఈ స్ఫూర్తి చూస్తే ముచ్చటేసింది. చిన్నప్పటి నుంచి క్రీడలకు నేను కాస్త దూరం. అయినప్పటికీ వచ్చే ఏడాది నేను కూడా ఏదైనా పోటీలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తాను అన్నారు.

 

  • సభాపతి అయ్యన్న పాత్రుడుకి ధన్యవాదాలు

 

స్వతహాగా హాస్య చతురతతో ఉండే సభాపతి అయ్యన్న పాత్రుడు చొరవ తీసుకొని ఈ పోటీలు నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. సభ్యులు కూడా అంతే ఉల్లాసంగా పోటీల్లో పాల్గొన్నారు. ధుర్యోధనుడిగా ఏక పాత్రాభినయం చేసిన డిప్యూటీ స్పీకర్ రఘరామ కృష్ణం రాజుకి, బాలచంద్రుడిగా చేసిన దుర్గేష్ కి, ఇతర సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒకప్పుడు రాష్ట్రంలో ఉన్న అరాచక ప్రభుత్వాన్ని సాగనంపడానికి అంతా ఏకమై ముందుకు సాగాం. ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడానికి ఇదే స్ఫూర్తితో ముందుకు వెళదాం అన్నారు.

 

Related posts

పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి

TNR NEWS

జర్నలిస్టు యూనియన్‌ గౌరవాధ్యక్షుడుగా ‘‘బాలెం’’

Dr Suneelkumar Yandra

దుకాణాల వద్ద మద్యపాన నిషేధంఅమలు చేయాలి..

Dr Suneelkumar Yandra

తిరుమల పవిత్రత పరిరక్షనే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా అడుగులు వేస్తున్న బీసీవై పార్టీ అధినేత

TNR NEWS

మర్రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కి హాజరైన పిజెఏ సభ్యులు

Dr Suneelkumar Yandra

పాడా తాత్కాలిక భవన ఆధునీకరణ పనులు సకాలంలో పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి