పిఠాపురం : దూబగుంట రోషమ్మ కలలుగన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే వారికి ఇచ్చే ఘనమైన నివాళులని మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎన్.సూర్యనారాయణ అన్నారు. గురువారం మధ్యాహ్నం పిఠాపురం మండలం మంగితుర్తి గ్రామం బి.టి.ఆర్ పేటలో దూబగుంట రోషమ్మ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. తొలుత ఆమె చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎన్.సూర్యనారాయణ మాట్లాడుతూ 1990లో సారా వ్యతిరేక ఉద్యమం ఉప్పెనగా మారడానికి రోషమ్మే కారణమని ఆయన అన్నారు. నెల్లూరు జిల్లాలోని ఆమె స్వగ్రామం దూబగుంట నుంచి ఆమె పూరించిన సారా వ్యతిరేక ఉద్యమ శంఖం తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతట విస్తరించిందన్నారు. ఈ క్రమంలో ఆమెకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యని సారా మాఫీయా ఆగడాలు, పోలీసు కేసులు, పెద్దల బెదిరింపులతో తట్టుకుని ఉద్యమంలో ముందుకు సాగారని అన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చారని కొనియాడారు. 1994 నాటి ఎన్నికల సందర్భంగా టిడిపి అధికారంలోకి వస్తే సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేస్తామని ఆనాటి టిడిపి వ్యవస్థాపక అధినేత ఎన్టీఆర్ ప్రకటించడానికి రోషమ్మ పోరాటమే ప్రధాన కారణమని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 1995 జూన్ ఒకటి నుంచి సంపూర్ణ మధ్యనిషేధం అమలు చేస్తున్నామని ప్రకటిస్తూ ఎన్టీఆర్ తొలి సంతకం చేశారని అన్నారు. ఈ ప్రకటనలతో రాష్ట్రంలో ఉన్న మహిళలు ఆనందం వ్యక్తం చేశారని, ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదని అన్నారు. 1997 అనంతరం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పగ్గాలు చేపట్టాక మధ్యనిషేధాన్ని ఎత్తివేసారని దీనిపై ఆమె పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. మహిళలందరూ ఆమె ఆశయ సాధన కోసం మద్యనిషేధంకై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ మండల కన్వీనర్ వనపర్తి సూర్యనారాయణ, కె.వి.పి.ఎస్.జిల్లా సెక్రెటరీ కె.సింహాచలం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డెక్కల లాజరు, మహిళలు సిమ్మ, శ్రీలక్ష్మి, పెంకె వనుగులమ్మ, నూకరాజు, లక్ష్మి, పోలవరపు రత్నం, కుమారి తదితరులు పాల్గొన్నారు.