కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే చట్టబద్ధమైన బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని కామారెడ్డి కాంగ్రెస్ డిక్లరేషన్ లో ప్రకటించిందని, అయితే నేటికీ అతీ గతీలేదని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సావిత్రి బాయి పూలే జయంతి పురస్కరించుకొని హైదరాబాదులో ఎమ్మెల్సీ కవిత చేపట్టిన బీసీ సదస్సుకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న సందర్భంగా గజ్వేల్ లో ర్యాలీ నిర్వహించి ఆయన మాట్లాడారు. అప్పటి పిసిసి అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 23 శాతం నుండి వెంటనే 42 శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్ అమలుకు డెడికేషన్ కమిటీ వేసి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. అయితే 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తేనే ఎన్నికలు చేపట్టాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే 42 బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా 42 శాతం పేరిట గొప్ప నాటకం ఆడిన కాంగ్రెస్ నిజ స్వరూపం అయిందని, నమ్మించి గొంతు కోయడమే కాంగ్రెస్ లక్ష్యమని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా బీసీ సంక్షేమానికి ప్రభుత్వం నిబద్ధతను చూపిస్తూ ప్రతిష్ట చర్యలు చేపట్టాలని క్రిమిలేయర్ విధానం బీసీలకు సమాన విద్య, ఉద్యోగ అవకాశాలకు అడ్డుగా ఉన్నందున వెంటనే రద్దు చేయాలని పేర్కొన్నారు. బీసీలకు సామాజిక న్యాయం సాధించే క్రమంలో ఐక్యంగా ముందుకు సాగుతామని, కామారెడ్డి డెకరేషన్లో ప్రకటించిన హామీల అమలుకు ఉద్యమిస్తామని, పోరాటం చేపడతామని స్పష్టం చేశారు. అంతేకాకుండా బీసీలకు లక్ష కోట్లతో సమగ్రాభివృద్ధి చేపట్టాలని, ప్రభుత్వ కాంట్రాక్టులో సైతం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు వర్తింపజేయాలని, ఇచ్చిన హామీ మేరకు ముదిరాజులను బిసి-డి నుండి బీసీ ఏ కుమార్చాలని డిమాండ్ చేశారు.