కామారెడ్డి పట్టణ విస్థరణను ఉద్దేశించిన మాస్టర్ ప్లాన్ ను వేంటనే రద్దు చేయాలని రైతు ఐక్య కార్యచరణ కమిటి ప్రతినిధులు డిమాండ్ చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో చూపించిన గ్రీన్ జోన్, ఇండస్ట్రీయల్ జోన్ లలో వ్యవసాయ భూములు చేర్చడాన్ని నిరశిస్తు ఎడాది కాలంగా 8 విలీన గ్రామాల రైతులు అందోళన చేస్తున్న విషయం తెలిసిందే.అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే మాస్టర్ ప్లాన్ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. కామారెడ్డి నూతన మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ జీవో విడుదల చేయాలని మాస్టర్ ప్లాన్ బాధిత 8 గ్రామాల రైతులు ఆదివారం సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో సమావేశమయ్యారు. రైతులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా విలువైన భూములను ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్లో చేర్చిందన్నారు. రైతులు చేపట్టిన ఉద్యమంతో దిగివచ్చిన ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామని చెప్పినా ఇప్పటివరకు జీవో ఇవ్వలేదన్నారు. మాస్టర్ ప్లాన్ను రద్దు చేస్తూ జీవో ఇవ్వాలని, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లు, అసెంబ్లీ ముట్టడిస్తామని, అరెస్టులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
