- జిల్లాల విభజనలో ప్రభుత్వాసుపత్రిని వికేంద్రీకరణ చేయకపోవడం వలన రోగుల అవస్థలు ఎక్కువయ్యాయి
- పౌరసంక్షేమ సంఘం
కాకినాడ : మూడేళ్ల క్రిందట ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను మూడు జిల్లాలుగా విభజన చేసి పరిపాలనా వికేంద్రీకరణ చేపట్టి నప్పటికీ కాకినాడలోని జిల్లా ప్రభుత్వాసుపత్రి వికేంద్రీకరణ జరగకపోవడం వలన రోగులు అవస్థలు యధావిధిగా కొనసాగుతున్నాయని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. చివరాఖరికి రోగులను ఆసుపత్రి విభాగాల్లోకి అత్యవసర ఎం ఎల్ సి, నాన్ ఎం ఎల్ సికి స్ట్రెచ్చర్ మీద తీసుకు వెళ్ళే ఎం ఎన్ వోల కొరత ఎక్కువవ్వడం దురదృష్టకరంగా వుందన్నారు. ఆసుపత్రి మొత్తంగా 180 మంది ఎం ఎన్ వోల అవసరం వుండగా 110మంది మాత్రమే విధుల్లో వుండడం తగదన్నారు. ఆసుపత్రి లో ఆవరణ కరువయ్యి పచ్చదనం పర్యావరణ లోపించడం.. భవనాల లేమితో కిక్కిరిసిపోవడం.. వాహనాల పార్కింగ్ కాలుష్యంతో అనారోగ్యం ఎక్కువ వ్వడం.. వైద్యులు వైద్య సిబ్బంది కొరత వలన ఆరోగ్యప్రయోజనాలు తగ్గిపోవడం.. డబ్బు ముట్టనిదే పని జరగని నిర్వహణ విమర్శలకు తావిస్తున్నదన్నారు. ఉమ్మడి జిల్లాను మూడు జిల్లాలు చేసిన రీతిగా ప్రభుత్వాసుపత్రి ని వేరు చేసి కాకినాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి ప్రత్యేక వైద్య సేవలు కల్పించే చర్యలు చేపట్టాలన్నారు. 7 రెవెన్యూ డివిజన్లు, 64 మండలాలు, 57 మండల ప్రజా పరిషత్తులు 1012 పంచాయితీలు, మునిసిపాలిటీలు, 14 పట్టణాలు, 1379 గ్రామాల నుండి వస్తున్న రోగుల సంఖ్యతో కాకినాడ ప్రభుత్వాసుపత్రి తట్టుకోవడం కష్టంగా వుందన్నారు.