సూర్యాపేట: వరి కోతలు ప్రారంభమైతున్నందున ప్రభుత్వం అన్ని గ్రామాలలో యుద్ధ ప్రాతిపాదికన ఐకెపి కేంద్రాలను ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలలో వరి కోతలు ప్రారంభమై 15 రోజులు అవుతున్న ప్రభుత్వం ఐకెపి కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం తక్షణమే అన్ని గ్రామాలలో ఐకెపి ప్రారంభించాలన్నారు. కాంటాలు వేసిన వరి ధాన్యాన్ని వెంటనే లిఫ్ట్ చేసి రైతాంగం ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. ఐకెపిలో కొనుగోలు చేసిన వరి ధాన్యానికి వెంటనే బిల్లులు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సహకార రంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్ వాటాదనం కల్పించి చిన్న, సన్న కారు రైతులకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతుందన్నారు. ధనిక రైతులకు ఉపయోగపడే విధంగా నూతన సహకార రంగాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు కో లిశెట్టి యాదగిరిరావు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, కందాల శంకర్ రెడ్డి, కొప్పుల రజిత, దుగ్గి బ్రహ్మం, గుమ్మడవెల్లి ఉప్పలయ్య, షేక్ సైదా, వై వీరాంజనేయులు, పల్లా సుదర్శన్, యానాల సోమయ్య, కుసు సైదులు పాల్గొన్నారు.

next post