తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ లకు నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ పాఠశాలల బంద్‌కు పిలుపునివ్వడంతో చేవెళ్ల డివిజన్ పరిధిలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. బంద్‌లో ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు ఎర్రవల్లి శ్రీనివాస్, కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్ పాల్గొని పలు ప్రభుత్వ పాఠశాలలను మూసి వేయించి విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలలో, గురుకుల పాఠశాలలలో మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, నాణ్యతలేని భోజనం అందించడం వల్ల ఫుడ్ పాయిజన్ లు జరిగి విద్యార్థులు అనేక రకాలుగా అస్వస్థతలకు గురవుతున్నారని అన్నారు. పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్రలో భాగంగానే వారికి నాణ్యమైన భోజనం అందించడం లేదని, ఫుడ్ పాయిజన్లు తరచుగా కావడం ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి దారితీసిందన్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరైనది కాదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, అదేవిధంగా పెండింగ్ లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు చరణ్ గౌడ్, బేగరి తేజ, చందు, సాయి గౌడ్, బన్నీ, అనిల్ కుమార్, బబ్లు, విష్ణు, ఇర్ఫాన్, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.