సూర్యాపేట : భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శతజయంతి వేడుకలను జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా గల సత్రం బజారులో ఆదివారం ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ వెంకటరమణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం సుప్రభాతం, 100 జ్యోతులతో మహానగర సంకీర్తనతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. అనంతరం రుద్రాభిషేకం, ముఖ్య అతిథులతో జ్యోతి ప్రజ్వలన, బాలవికాస్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. మధ్యాహ్నం నారాయణ సేవ ఏర్పాటు చేయబడుతుందని, సాయంత్రం 6 గంటలకు భజనలు నిర్వహించి మహా హారతితో వేడుకలు ముగిస్తామని తెలిపారు. భగవాన్ సత్య సాయిబాబా శతజయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
