ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియలో జిల్లాలోని ప్రతి కుటుంబం వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. బుధవారం జిల్లాలోని దహేగాం మండలం బిబ్రా గ్రామపంచాయతీలో కొనసాగుతున్న కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తీరును కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, దహేగాం మండల తహసిల్దార్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సర్వే ప్రక్రియలో కుటుంబ సభ్యుల వివరాలు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్ లలో పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యుల వివరాలు నిర్ణీత నమూనాలో స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. నిర్దేశించిన ఫారంలో ప్రతి అంశాన్ని ప్రజల వద్ద నుండి తప్పనిసరిగా సేకరించాలని, అందుబాటులో లేని వారి ఇంటికి మరొకసారి తప్పనిసరిగా వెళ్లాలని, ఒక్క కుటుంబం కూడా మినహాయింపు కాకూడదని తెలిపారు. సర్వే ముందు రోజు ఏ ప్రాంతంలో సర్వే నిర్వహిస్తున్నారో సంబంధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని, సర్వే లక్ష్యాన్ని సాధించవలసిన బాధ్యత ఎన్యుమరేటర్లపై ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి, పంచాయతీ కార్యదర్శి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.