క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటామని,దీని ప్రధాన ఉద్దేశం క్యాన్సర్ గురించి అవగాహన పెంచడం, నివారణ చర్యలను ప్రోత్సహించడం అని తెలిపారు. మారుతున్న జీవనశైలి కారణంగా సమాజంలో క్యాన్సర్ వ్యాధి తీవ్ర రూపం దాలుస్తుందన్నారు.ప్రజల నిత్య జీవన విధానంలో ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం, మెరుగైన ఆరోగ్య అలవాట్లను పెంపొందించుకోవడం వల్ల క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉంటుందన్నారు. నిరంతర వ్యాయామం, చక్కని ఆరోగ్య అలవాట్లను పాటించడం ద్వారా క్యాన్సర్ కు దూరంగా ఉండవచ్చు అన్నారు.ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా క్యాన్సర్ వ్యాధిని నయం చేసుకోవచ్చని తెలిపారు. క్యాన్సర్ వ్యాధికి ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు అందుబాటులో ఉన్నాయని, సరైన చికిత్స ద్వారా క్యాన్సర్ ను నయం చేసుకోవచ్చన్నారు. ఫిబ్రవరి 10వ తారీఖు నాడు నులి పురుగుల నివారణ దినోత్సవం ఒకటి నుండి 19 సంవత్సరాల పిల్లలకు స్కూళ్లలో,అంగన్వాడీ కేంద్రాలలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో మాత్రల పంపిణీ జరుగుతుందని, పిల్లల తల్లిదండ్రులు వీటికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినయ్ కుమార్, ఆరోగ్య విస్తరణ అధికారి బి భాస్కర్ రాజు, ఎన్సిడి కోఆర్డినేటర్ సాంబశివరావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లింగారెడ్డి, మరియు ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది పాల్గొన్నారు.