పిఠాపురం : జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని, రక్షణ కల్పించాలని పిఠాపురం నియోజకవర్గ జర్నలిస్టులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి డిప్యూటీ తహశీల్దార్ రామచంద్రరెడ్డి కి వినతిపత్రం అందజేశారు. పార్వతీపురం మన్యం మక్కువ మండల “ప్రజాశక్తి” విలేకరి రామారావుపై ఆ మండల టిడిపి అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు దాడి చేయడం,బెదిరించడం దారుణమన్నారు. మక్కువ మండలం ఏ- వెంకంపేట నుండి కాశీపట్నం వెళ్లే నూతన రహదారి వద్ద వేణుగోపాల్ నాయుడిని కలవడానికి వెళ్లిన విలేకరి రామారావుపై టిడిపి నేత బూతులు తిట్టడమే కాకుండా దాడి చేశారని ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఆన్నారు. ఇటీవల ప్రజాశక్తి పత్రికలో ‘ఎన్నికల కోడ్ అధికారులకు పట్టదా..?’ అనే శీర్షికన మంత్రి సంధ్యారాణి ఫ్లెక్సీలతో ఉన్న ఫోటోతో వార్త వెలువడగా కక్ష్య పెట్టుకున్న వేణుగోపాల్ నాయుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ దాడికి పాల్పడ్డారన్నారు. విలేకరి రామారావు పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. సిఐటియు నాయకులు కుంచె చిన్న మద్దతు తెలిపారు.

next post