పౌర సంక్షేమ సంఘం డిమాండ్
కాకినాడ : జనాభా ప్రాతిపదికన గ్రామాలకు ఆర్థిక సంఘం నిధులు 70 శాతం మంజూరు చేస్తున్న ప్రభుత్వం కాకినాడ విలీన గ్రామాలకు ఎన్నికలు నిర్వహించకుండా స్థంభింపజేయడం ఎంతవరకు సబబని పౌర సంక్షేమ సంఘం ప్రశ్నించింది. 15ఏళ్లుగా తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల, గంగనాపల్లికి చెందిన స్వామినగరం టీచర్స్ కాలనీ గ్రామాలకు పౌర సౌకర్యాల కల్పనలో అభివృద్ధికి తావు లేకుండా దిగ్బంధం చేయడం సమంజసం కాదన్నారు. పంచాయతీ రాజ్ నుండి వేరు చేసిన ప్రభుత్వం కార్పోరేషన్ లో విలీనం చేసిన ప్రభుత్వ యంత్రాంగం చట్ట పరమైన ప్రక్రియలను పూర్తి చేయకపోవడం వలన అసౌకర్యాల చెరలో మ్రగ్గుతున్న దుస్థితి వుందన్నారు. వీటి సమస్యను డోలా మానం చేయడం వలన కాకినాడ ఎన్నికలు జరగక మూడేళ్లుగా ఆర్థిక సంఘం నిధులు రావడంలేదన్నారు. 70శాతం ఆర్థిక సంఘం నిధులు విలీన గ్రామాలకు విడుదల చేసి సురక్షిత త్రాగునీరు సరఫరా ఇంటింటికీ మంచినీరు కుళాయి, అన్ని రహదారులకు సిసి రోడ్లు, కాలువల నిర్మాణం, వీధిస్థంభాలు, విద్యుత్ దీపాల అమరిక, పచ్చదనంతో పార్కుల అభివృద్ధి, రోజువారీ పారిశుద్ధ్య నిర్వహణ ప్రాజెక్ట్ పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయలేకుంటే తక్షణమే కాకినాడ కార్పోరేషన్ లో విలీనం పెండింగ్ పూర్తి చేసి గ్రేటర్ కాకినాడగా ఎన్నికలు పూర్తి చేయడం ద్వారా జిల్లా కేంద్రాన్ని సంపూర్ణ అభివృద్ధి చేయాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు. చట్ట సభల ప్రతినిధుల మౌనం వీడాలని తక్షణ చర్యలు వహించాలని కోరారు.