Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ప్రత్యేక కథనం

పోటీ!

పోటీ!

‘పోటీ అనేది ఆటవిక న్యాయం, సహకారం అనేది నాగరిక న్యాయం’ అని అంటారు పీటర్‌ క్రొపొట్కిన్‌. కానీ అనాగరికంలోనూ, ఆటవికంలోనూ పరస్పర సహకారాలున్నాయి. అసలు ప్రకృతి పరిణామంలోనూ ఘర్షణ, సహకారం కలగలసే ఉంటాయి. సహకారంతోనే అభివృద్ధి అంతా జరిగింది. ఘర్షణ వేరు, పోటీ వేరు. పోటీతో అసూయలు, కోపాలు, ద్వేషాలు, శతృత్వాలు పెరగటానికి అవకాశాలున్న వ్యవస్థ మనది.

పోటీ అనేది సముజ్జీల నడుమ, సమాన స్థాయిల మధ్య ఉండటం, అదీ అభివృద్ధి కోసం ఆరాటంగా ఉండాలే తప్ప, క్రూరత్వానికీ, నిస్సహాయితకు దారి తీయకూడదు. అందులోనూ ఈ పోటీలోకి డబ్బు ప్రభావం పెరిగిన తర్వాత గెలవటం, ఓడటం వ్యాపారంగా మారిపోయింది. పోటీలో ఓడిననాడు, పోటీపడలేనినాడు, మనల్ని మనం నిందించుకోవడం, అసమర్థునిగా చిత్రించుకోవడం పెరిగి ఒత్తిడికి గురయ్యి భవిష్యత్తునే ఛిద్రం చేసుకుంటున్నాము.

ముఖ్యంగా ఈ పోటీ విద్యారంగానికి పాకి, విద్యార్థుల తల్లిదండ్రుల పాలిట ఒక భయంకర ఉచ్చులా బిగుసుకుంటోంది. పిల్లలు అనేకానేక కారణాల, ప్రమేయాల వల్ల భిన్నమయిన స్థాయిలను కలిగి ఉంటారు. వేరు వేరు నైపుణ్యాలనూ, సృజనాత్మకతలను, దృష్టికోణాలను కలిగి ఉంటారు. కానీ నేడు మన విద్యా వ్యవస్థ ఒకే రకమైన మూస తరహా యాంత్రిక విజ్ఞానాన్ని అందించే కేంద్రంగా మారింది.

ఇందులో పోటీపడి ఓడినవాడు, ఎందుకూ పనికిరాడనే భావాన్ని కలిగించడమూ ఈ విద్యావ్యవస్థ అందించిన ఆలోచనే. అందుకనే అనేకమంది ఐఐటీలు చదువుతున్న విద్యార్థులు, ఒత్తిడి భరించలేక తమను తామే హత్య చేసుకుంటున్నారు. లేదంటే హత్యలు చేసేవాళ్లుగా మారిపోతున్నారు. కాకినాడలో జరిగిన సంఘటన చూస్తే, ఈ విద్యావ్యవస్థ ఎంతటి క్రూరత్వాన్ని ఇంజెక్ట్‌ చేస్తున్నదో బోధపడుతుంది.

ఆ సంఘటన తలుచుకుంటేనే గుండెలన్నీ అవిసిపోతున్నాయి. ఒకటో తరగతి, యూకేజీ చదువుతున్న ఇద్దరు పిల్లల్ని చేతులు, కాళ్లూ తాళ్లతో కట్టేసి, నీటి బకెట్‌లో తలలు ముంచి స్వయాన తండ్రే తన పిల్లల్ని దారుణంగా చంపేసాడు. తన పిల్లలు ఇతరులతో పోటీపడలేకపోతున్నారని, ప్రపంచంతో పోటీ పడలేక పోతున్నందుకు చంపేస్తున్నాననీ మరీ సూసైడ్‌ నోట్‌ రాసి చంపేశాడు. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.

తండ్రి చ దువుకున్నవాడే, ఓఎన్‌జీసీలో ఉద్యోగం. మరి చదువు ఏమిచ్చింది ఇతనికి? ఎదురీది బతకటమెలాగో నేర్పాలి కదా చదువు! ముక్కు పచ్చలారని పిల్లల్ని చంపడమేమిటి? ఎంత క్రూరత్వం నిండుతోంది మనుషుల్లో! అంత చిన్న పిల్లలు ఎవరితో పోటీపడాలి! ఎల్‌కేజీ నుండే ఐఐటీ కోచింగ్‌లకు అవకాశమిస్తున్న బడులూ, అందుకోసం మరీ పిల్లల్ని పంపుతున్న తల్లిదండ్రుల్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ రకమైన విధానం ఎందుకు పురుడుపోసుకుంది? విద్య, లాభనష్టాల వాణిజ్యమయ్యాక అందే ఆలోచనదే.

డాలర్‌ కరెన్సీలు పోగుపడేసే మరలుగా మారిపోవడం తప్ప, మనుషులు మానవీయంగా వ్యవహరించడం ఆవిరయిపోతూనే ఉంది. పిల్లల, వారి వారి మానసిక స్థితులను బట్టి, అభిరుచులనుబట్టి ఎలాంటి శిక్షణలిప్పించాలన్న ఆలోచనలే లేని అశాస్త్రీయ విద్యా వ్యవస్థ మనది. పిల్లలు ఇలానే ఎదగాలన్న మూసధోరణి మనందరిలోనూ వేళ్లూనుకొని ఉంటోంది. సమాజ మానసిక స్థితీ అనారోగ్యమైపోయింది.

మొన్నీ మధ్య హైద్రాబాద్‌లో అప్పులయ్యాయని చదువుకున్న అధ్యాపకుడే, తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, తానూ, తన భార్య ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి బలహీన మానసిక స్థితిలోకి నేటితరం ఎక్కువగా వెళ్లటం ఆందోళన కలిగించే విషయం. పిల్లలను, భార్యను చంపే అధికారం ఎవరిచ్చారు వీళ్లకి? ఈ చదువులు ఎంత అపసవ్య జ్ఞానాన్ని అందిస్తున్నాయి! మానసిక దౌర్భల్యం పెరిగిపోతున్నది. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీయటమో, ప్రాణాలు తీసుకోవటమో చేస్తున్నారు. ఇవన్నీ సామాజిక రుగ్మతలో భాగంగా జరుగుతు న్నాయి. నేటితరం మెదళ్లపై వచ్చిపడుతున్న సమాచారమూ, విషయమూ, దృశ్యమూ అన్నీ వ్యాపారాత్మక వ్యర్థ కాలుష్యాలతో నిండిపోతున్నది. అదే తిరిగి ప్రతిఫలిస్తున్నది.

ఇటీవల ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులను కొట్టలేక, తిట్టలేక, చదువు, క్రమశిక్షణ నేర్పలేకపోతున్నామని బాధపడుతూ విద్యార్థులనే క్షమాపణ కోరుతూ సాక్షాంగ నమస్కారం చేశాడు. అంటే, విద్యార్థులను దండించే, తిట్టే అధికారం లేకుండా పోయిందని, అది లేకపోతే అధ్యయనం సాగదని బాధపడటంలో ఎంత అవగాహనా రాహిత్యం ఉందో అర్థమవుతుంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇలాంటి అశాస్త్రీయ ఆలోచనలతో విపరీత చర్యలకు పూనుకుంటున్నారు.

ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, స్వేచ్ఛగా పిల్లలు అభ్యసనం కొనసాగించగలిగితేనే నిజమైన మనుషులుగా, మానవీయతతో ఎదుగుతారు. ప్రేమైక సమాజానికి వారసులవుతారు. పోటీలోపడి కొట్టుకుపోతే బ్రతుకునే కోల్పోతారు. తల్లిదండ్రులూ ఆలోచన చేయండి!

Related posts

పాన్‌కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా..?

TNR NEWS

తొర్రూర్ బస్టాండ్ ఆవరణంలో ఆర్టీసీ విజయోత్సవాలు  బస్టాండ్ లోపల సిసి కెమెరాలు లేని వైనం  విజయోత్సవాలు కాదు అభివృద్ధి కావాలి  విజయోత్సవాలు ఫ్లెక్సీల పై కాదు 

TNR NEWS

ప్రేమ పరీక్ష

గొల్లగట్టును రాష్ట్ర పండుగగా గుర్తించాలి మన సాంస్కృతిక చరిత్రను కాపాడుకోవాలి. ఇది గొల్ల గట్టు (పెద్దగట్టు) జాతర చరిత్ర

TNR NEWS

నాటి జ్ఞాపకాలు..

Dr Suneelkumar Yandra

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకంక్షలు_