సూర్యాపేట టౌన్ : సూర్యాపేట మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో సూర్యాపేట పట్టణంలోని వివిధ వార్డులలో ఉన్న సిసి రోడ్లను పగలగొట్టడం సమంజసం కాదని సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి సాయికుమార్ అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణం 7వ వార్డులో జరిగిన సిపిఎం పార్టీ శాఖ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలకులకు ముందు చూపు లేకపోవడం తో ఇటీవల లక్షలాది రూపాయల ఖర్చుతో సూర్యాపేట పట్టణంలో వేసిన సీసీ రోడ్లను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో పగలగొట్టడం మూలంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. సీసీ రోడ్లను పగలగొట్టి మట్టిని పోల్చకుండా అక్కడే వదిలివేయడం మూలంగా వాహనదారులు, వ్యాపారస్తులు పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ వారు వేసే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు చిన్నవి వేస్తున్నారని దాని ద్వారా ఆ రోడ్డు ప్రక్కన ఉన్న ఇండ్ల మురికి నీరు ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. తక్షణమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో పగలగొట్టిన సిసి రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేపట్టి పట్టణ ప్రజలు ఇబ్బందుల పాలు కాకుండా చూడాలని అన్నారు. తక్షణమే సమస్య పరిష్కారం చేయకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి రాచూరి జానకిరాములు, నాయకులు మొగిలి వెంకన్న, మంగయ్య, వెంకటయ్య, సైదమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.