- అవతారి శ్రీ హుస్సేన్ షా (సప్తమ పీఠాధిపతి) వారి 120వ జయంతి మహాసభ
పిఠాపురం : శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠమునకు పీఠాధిపతులలో ఆదిపీఠాధిపతి 1472 సం॥లో భారతదేశమునకు వచ్చియున్నారు. ఆదిలో ఈ పీఠము బాగ్దాద్ నుండి భారతదేశంలో ఢిల్లీ నగరమునకు వచ్చి, మొగలాయీ చక్రవర్తలకు ఆస్థాన గురువులుగా ఉండే వారు.అక్కడ “సర్మద్ హుస్సేన్” అను పేరుగల తత్వవేత్తను ఔరంగజేబు చంపించినపుడు వారి సమకాలీకుడైన ఈ పీఠాధిపతి తానేషా కాలమున హైదరాబాదు వచ్చిన తరువాత, తానీషా పీఠమునకు జాగీరొసంగిన కారణమున, పీఠము ఆంధ్రప్రదేశములో ప్రవేశించి పీఠకాపురమును స్థిరనివాసము ఏర్పరచుకున్న మొదటి పీఠాధిపతి “మదీన్ కబీర్షా” వారి తరువాత వారి అగ్రనందనుడు “మధార్షా” (ద్వితీయ పీఠాధిపతి) తరువాత వారి సుతులు “హాసన్ మియాషా” (తృతీయ పీఠాధిపతి) వారి కుమారులు “కహెన్ షావలీ” వీరి బాల్యమందే వీరి తండ్రి “హసన్ మియాషా” దివంగతులైన కారణమున వారికి తిరిగి “ఆఖైలలీషా” గురువర్యులచేత ఈ పీఠతత్వస్వరూపమైన మహామంత్రము ప్రభోధించబడి తిరిగి ఈ పీఠము పునః స్థాపితమైనది. చతుర్థ పీఠాధిపతి “కహెన్ షావలీ” గారి పీఠాధిపతి కాలములో తునిలో ఉంటూ తాత్వికజ్ఞానం బోధిస్తూ, “కల్కి భాగవతము” అనే గ్రంథము రచించిరి. ఈశ్వర పరిణామము తెలుపు మహాత్మ్యములతో నిండిన తత్వము చెప్పబడినది. తరువాత వారి అగ్రనందనుడైన పంచమ పీఠాధిపతి బ్రహ్మర్షి మొహియద్దీన్ బాద్షా గురువర్యులు పిఠాపురం స్థిర నివాసంగా ఏర్పరచుకొని, స్వానుభవైకవేద్యమైన కీర్తనలు, పద్యములు “పరతత్వ కీర్తనలు” అను గ్రంథమును రచించిరి. వీరి తరువాత వీరి అగ్రనందనులు బ్రహ్మర్షి డా.ఉమర్ ఆలీషా మహాకవిగారు షష్ణమఠాధిపతిగా పీఠాన్ని అధిష్టించిరి. వీరిని ఎరిగిన వారు యావత్ సృష్టిని కలరు. వీరు పారశీక, ఉర్దూ, సంస్కృతాంధ్ర, ఆంగ్ల భాషాకూలంకషులు, తరువాత వారి అగ్రనందనులైన, బ్రహ్మర్షి హుస్సేన్ షా గురువర్యులు సప్తమ పీఠాధిపతిగా పీఠమునధిష్టించి, వీరు ది.09-09-1905వ సం మంగళవారం ఉదయం పునర్వసు నక్షత్రాన బ్రహ్మర్షి డా.ఉమర్ అలీషా, శ్రీమతి అగ్భరున్నీసాబేగం పుణ్య దంపతులకు అగ్రనందనులుగా జన్మించారు. వీరు తల్లి గర్భములో 27 నెలలు ఉన్నట్లున్ను, జన్మించిన తరువాత సూర్యుడు ఉదయించు దేశము నుండి అస్తమించు దేశము వరకు వీరి కీర్తి ప్రపంచం నలుమూలల వ్యాపించునని వీరి తల్లిగారు చెప్పినట్లు నానుడి. ఆయన రాజావారి హైస్కూలులో 8వ తరగతి చదువుచుండగా గాంధీగారి సహాయనిరాకరణోద్యమంచే ఆకర్షింపబడి స్కూలు మానివేశారు. అయినా వారు ఇంటిలో ఉండి భారత, భాగవతాది గ్రంధములు, భగవద్గీత, ఉపనిషత్తులు గంటకు 60 పేజీల చొప్పున ప్రతి రోజూ 8 గంటలు చదివేవారు వీరు ఏక సంతాగ్రాహి, పన్నాల సుబ్రహ్మణ్యశాస్త్రి గారి వద్ద సంస్కృత విద్యనభ్యసించిరి. అనేక పద్యాలు, గేయాలు వ్రాసేవారు సహాయ నిరాకరణోద్యమం తరువాత ఆపిన చదువును మరల వారి తండ్రిగారి సలహా ప్రకారం బందరు నేషనల్ కళాశాలలో చేరి, చదివినారు. బెజవాడ గోపాల రెడ్డి వారి సహాధ్యాయుడు, మంచి స్నేహితుడు. శ్రీ హుస్సేన్ షా గారి వివాహం 03-02-1928 శుక్రవారం జరిగినది. వీరి సతీమణి అజీమున్నీషాబేగం గారు. తండ్రిగారు పార్లమెంటు సభ్యులుగా వారితో అనేక సార్లు ఢిల్లీ వెళ్ళారు. తండ్రిగారి స్నేహితులతో వీరికి పరిచయం ఉండేది. నిరాడంబర జీవితం ఆదర్శం కాబట్టి రాజకీయాలంటే యిష్టపడేవారుకాదు. వీరు 10-02-1945వ సం||న ఈ పీఠమునకు పీఠాధిపత్యము వహించిరి. తన్నాశ్రయించిన భక్తకోటిని ముముక్షువులుగా మార్చిన తపోధనులు, సంహితమనునొప్పు “షా తత్వము” అను గ్రంథాన్ని 09-09-1967న ప్రారంభించి 09-09-1968 నాటికి పూర్తి చేశారు. వీరికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు వీరు రచించిన “షా తత్వము” అభౌతికమైన వాక్సందేశము ఉపనిషద్రూపంగా వచ్చిన అభౌతిక ధ్వని. ఇది మతమతాంతరముల పై విమర్శలు లేకుండా సర్వమత సమ్మతమైన మానవ వ్యక్తిత్వ పరిణామము పై మోసి ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనలై వచ్చిన భావపరిణామము ఉపనిషద్రూపంగా వచ్చిన ధ్వని అక్షర రూపంగా తెలుప బడినది. “ఎపుడు తన శిష్యు పుత్రగానెంచునట్టి ఎపుడు విడిపోని బాంధవ్యమెవడు నెరపు” అను విధానమును నిర్దేశించిన మహనీయులు, వీరు 1945 నుండి 1981 వరకు ఈ పీఠమును నడిపిన రసస్వరూపి. వీరు 24-09-1981 తేదీన అవతారం చాలించిరి. వీరు రచించిన “షా తత్వము” గ్రంథములో “మానవుడు” మొదలు “ఆశ్వాసాంతము” వరకు మొత్తము 91 అధ్యాయములు కలవు ఈ గ్రంథము విజ్ఞాన సర్వస్వము (ఎన్సైక్లోపెడియా)గా అభివర్ణించవచ్చును. వీరి తదుపరి వీరి అగ్రనందనలు పరబ్రహ్మ శ్రీ మొహియుద్దీన్ బాద్షా సద్గురువర్యులు అష్టమ పీఠాధిపతులుగా 25-09-1981 తేదీన పీఠాన్ని అధిష్టించి 31-07-1989 వరకు జ్ఞాన ప్రభోద చేసిరి. తదుపరి వీరి అగ్రనందనులుగా డా.ఉమర్ అలీషా సద్గురువర్యులు ప్రస్తుత పీఠాధిపతిగా 09-09-1989 నుండి విశ్వమానవ కళ్యాణం కొరకు మత సామరస్యం కొరకు, మానవతా విలువల పరిరక్షణకు, దేశ సమగ్రత కొరకు, విశ్వ శాంతి కొరకు గత 36 సంవత్సరాల నుండి అవిశ్రాంతముగా కృషిచేయుచున్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు, ఉమర్ ఆలీషా సాహితీ సమితి ద్వారా సాహిత్య కార్యక్రమాలు, తత్వజ్ఞానం మాస పత్రిక,104 ఆశ్రమ శాఖల ద్వారా ఆద్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమర్ ఆలీషా గారి అధ్యక్షతన అవతారి శ్రీ హుస్సేన్షా సద్గురువర్యుల 120వ జయంతి మహా సభ 09-09-2025 తేదీ ఉదయం 09 గంటలకు పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేయబడినది. ఈ మహా సభలో మాతృ వందనం అనే పుస్తకాన్ని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా స్వామి వారు ఆవిష్కరణ చేస్తారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీ హుస్సేన్ షా కవి స్మారక అవార్డు బహుకరిస్తారు. అనంతరం ఆసక్తి కలిగిన వారికి మహామంత్రం ఉపదేశిస్తారు. ప్రతీ ఒక్కరూ ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి తరించవలసినదిగా ఆశ్రమ కన్వీనర్ పేరూరి సూరిబాబు కోరారు.