ఇదే నిజం, దౌల్తాబాద్: రాష్ట్రంలో రేవంత్ సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైందని, ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ప్రారంభమైందని, కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్ షో అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త రాజారాం మధు సోదరుడు ఇటీవల మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజారాం మధు సోదరుడు రాజారామ్ అకాల మరణం బాధాకరమని, ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అధైర్యపడవద్దని అండగా ఉంటామని భరోసానిచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్రస్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైందన్నారు. కాంగ్రెస్ పాలనలో సీఎం సొంత నియోజకవర్గంలోనే కలెక్టర్, ఆర్డీవో ఇతర అధికారులపై దాడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకతతో అధికారుల మీద దాడులు చేస్తున్నారన్నారు.4 వేల పెన్షన్ లేదు, కె సిఆర్ కిట్టు లేదు, కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం లేదు. ఇలా వారు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదన్నారు.ప్రజలు కార్మికులు ఉద్యోగులు ఎవరు ప్రశ్నిస్తే వారిని అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు. రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ రైతులను మోసం చేస్తుందన్నారు. అధిక వర్షాలతో పత్తి పంటలు తీవ్రంగా నష్టపోయాయని కాస్తోకూస్తో పండిన పంటను కొనే నాధుడే కరువయ్యారని, సిసిఐ వాళ్ళతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు కలగకుండా మద్దతు ధరను కల్పించి కొనుగోలు చేపట్టాలన్నారు. వరి ధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ చెల్లిస్తామని ఎన్నికలలో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నరకం వడ్లకే బోనస్ చెల్లిస్తామని మాట మార్చారు. కొనుగోలు కేంద్రాలలో అధికారుల పర్యవేక్షణ కరువైందని రైతులకు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ప్రజల పక్షాన హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వంపై పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, మాజీ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, రాష్ట్ర యువజన విభాగం నాయకులు రాజిరెడ్డి, మాజీ సర్పంచ్లు కరుణాకర్, తిరుపతి నర్సింలు, రామచంద్రం గౌడ్, గ్రామ అధ్యక్షులు బాల్ నర్స్, నాయకులు సత్యం, ఇప్ప దయాకర్, యాదగిరి గౌడ్, జగపతి రెడ్డి, శ్యామ్, మురళి గౌడ్, స్వామి, భార్గవ్, ప్రభాకర్, స్వామి, సందీప్, మల్లేశం, నవీన్ తదితరులు పాల్గొన్నారు.