అమరావతి : ఏపీలో వాహనదారులకు పోలీసుశాఖ షాకిచ్చింది. మోటారు వాహనాల చట్టం అమల్లో ఉన్నప్పటికీ అందులో నిబంధనల్ని పాటించకుండా యథేచ్ఛగా రహదారులపై వాహనాలు నడుపుతున్న వారిపై కొరడా ఝళిపించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను చూపిస్తున్నారు. దీంతో రేపటి నుంచి ఏపీలో వాహనాలు నడిపేవారు ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్ సహా అన్ని పత్రాలు, హెల్మెట్ తీసుకుని వెళ్లాల్సిందే. రాష్ట్రంలో రహదారులపై వాహనాలు నడిపే ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు,లారీలు, ఇతర వాహనాలు నడిపే డ్రైవర్లపై మోటారు వాహన చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటివరకూ నిబంధనలపై అవగాహన కల్పించామని, రేపటి నుంచి భారీ జరిమానాలు తప్పవని పోలీసులు ప్రకటించారు. అంతే కాదు ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఎంత జరిమానా విధిస్తారో కూడా వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే వారితో పాటు వెనుక సీట్లో కూర్చొన్న వారికి సైతం వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధిస్తారు. ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే మొదటిసారి 2 వేలు, రెండోసారి 4 వేలు జరిమానా విధిస్తారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 5 వేలు జరిమానా కట్టాల్సి ఉంటుంది. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే 1500 జరిమానా ఉంటుంది. వాహనం నడుపుతూ సెల్ ఫోన్ వాడితే తొలిసారి 1500, రెండోసారి 10 వేలు జరిమానా విధిస్తారు. ఆటోవాలాలు యూనిఫాం లేకుండా వాహనం నడిపితే తొలిసారి 150, రెండోసారి 300 జరిమానా విధిస్తారు. వాహనాలు రిజిస్ట్రేషన్ లేకుండా, ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేకుండా, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకోకుండా నడిపితే తొలిసారి 2 వేలు, రెండోసారి 5 వేలు జరిమానా విధిస్తారు. అతి వేగంగా వాహనం నడిపితే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు. బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేస్తే వెయ్యి రూపాయలు జరిమానా ఉంటుంది. వాహనాల రేసింగ్, వేగం పెంచే ప్రయత్నాలు చేస్తే తొలిసారి 5 వేలు, రెండోసారి 10వేలు జరిమానా విధిస్తారు. కాబట్టి ఇవన్నీ పాటించాల్సిందేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.