సూర్యాపేట:అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసి ముద్దయి రైతుల కష్టార్జిత పంట నష్టపోతున్నదని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూరైతులు తమ రక్తం చెమటతో పండించిన వరి పంటను ఐకెపి కేంద్రాలకు తరలించి రాసులుగా వేసారని, పట్టాలు కప్పినప్పటికీ భారీ వర్షాలతో గాలులు వీచి పట్టాలు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసి ముద్దయిందని అన్నారు. ఐకెపి కేంద్రాలలో సరైన వసతులు, భూమి సదుపాయాలు లేక రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తిరస్కరించడం అన్యాయం అన్నారు. రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడి వెంటనే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మెచ్యూర్ పేరుతో వారాల తరబడి రైతులను కేంద్రాల్లో వేధించడం సరికాదుఅని అన్నారు.తేమ శాతాన్ని పెంచి తడిసిన ధాన్యాన్ని సడలింపుతో కొనుగోలు చేయాలని, రైతులకు కనీసం పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతులు తమ జీవితాధారం అయిన పంటను రక్షించుకోలేని పరిస్థితి నెలకో ని ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే ముందుకు వచ్చి నష్టపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. లేనిపక్షంలో రైతులతో నిరసనలకు దిగే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు.
