స్వామియే శరణం అయ్యప్ప.. అయ్యప్ప శరణం స్వామియే.. శరణం శరణం అయ్యప్ప శరణం అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో మండల పరిధిలోని రామన్నగూడ గ్రామం మారుమ్రోగింది. ఆ గ్రామానికి చెందిన కన్నెస్వామి పెద్దొళ్ల దయాకర్ ఆధ్వర్యంలో గ్రామ నడిమధ్యన గల గ్రౌండ్ లో అయ్యప్పస్వామి మహాపడి పూజ మహోత్సవం అంగ రంగ వైభవంగా నిర్వహించారు. యం యం క్రిష్ణన్ గురుస్వామి నేతృత్వంలో జరిగిన పూజా కార్యక్రమంలో వందలాది మంది అయ్యప్ప స్వాములు పాల్గొని అయ్యప్ప నామ స్మరణం, భజన పాటలు, భక్తి గీతాలను ఆలపించారు. అయ్యప్ప స్వాములు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ అయ్యప్ప స్వామిని కీర్తిస్తూ మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. 18 పడి మెట్లకు పూజలు చేశారు. అనంతరం, స్వాములకు, భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ళ కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి, చేవెళ్ల మాజీ సర్పంచ్ బండారి శైలజా ఆగిరెడ్డి, నాయకులు దేశమోళ్ల ఆంజనేయులు, కృష్ణారెడ్డి, కర్నే శివ ప్రసాద్, పెద్దొళ్ల ప్రభాకర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.