హైదరాబాద్: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. 2025, జనవరి 14వ తేదీన నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
మొత్తం 3 దఫాలుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా కొన్ని కీలక మార్పులు చేయాలని సర్కార్ నిర్ణయించింది. కనీసం ఐదుగురు ఎంపీటీసీలతో ఒక ఎంపీపీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం కొన్ని మండలాల్లో ముగ్గురు ఎంపీటీసీలతో ఒక ఎంపీపీ ఉంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీపీ బిల్లు తెచ్చే యోచనలో సర్కార్ ఉంది.
2024, ఫిబ్రవరి నెలతోనే తెలంగాణలో సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ఇన్ఛార్జ్ల పాలన నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగబోతున్న తొలి సర్పంచ్ ఎన్నికలు ఇవే కావటం గమనార్హం. దీంతో ఈ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ప్రత్యేకాధికారుల పాలనపై ఇప్పటికే ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి.