పిఠాపురం : శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 6వ పీఠాధిపతి కవిశేఖర్ డా.ఉమర్ ఆలీషా 140వ జయంత్యోత్సవ సభ శుక్రవారం ఉదయం 8గంటలకు కాకినాడ పట్టణంలోని బోట్‌క్లబ్ వద్ద కాకినాడ లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం కన్వినర్ పేరూరి సూరిబాబు తెలిపారు. కవిశేఖర్ డా.ఉమర్ ఆలీషా 1885 ఫిబ్రవరి 28వ తేదీన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పంచమ పీఠాధిపతి బ్రహ్మర్షి మొహిద్దీన్ బాద్షా, చాన్బియాంబ దంపతుల ప్రథమ కుమారుడిగా జన్మించి, 553 సంవత్సరముల సుదీర్ఘ సనాతన ఘన చరిత్ర కలిగి ఆర్ష, సూఫీ సిద్ధాంత ప్రాతిపదికగా ఆధ్యాత్మిక విద్యను సర్వ మానవాళికి అందించాలని కృషి చేస్తున్న శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠమునకు 6వ పీఠాధిపతిగా ఆయన వ్యవహరించారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుభాషా కోవిదునిగా, ఉత్తమ పార్లమెంట్ సభ్యునిగా జీవితకాలం ఆ పదవికే వన్నె తెచ్చిన గొప్ప రాజకీయ నీతిజ్ఞునిగా పేరు గాంచారు. స్త్రీ, దీనజనోద్ధారణకు ఎనలేని కృషి చేసి సమాజంలోని అసమానతలు రూపుమాపిన సంఘ సంస్కర్తగా నిలిచారు. ఎన్నో కవి పండిత సమ్మేళనాలలో శతావధానాలు చేసి ఎంతో మంది సంస్థానాధీశుల సత్కారాలు పొందిన తొలి తెలుగు ముస్లిం కవిగా చరిత్ర సృష్టించారు. బాల్యంలోనే పంచకావ్యాలు పూర్తిచేసి కోనసీమ పేరూరు వాస్తవ్యులు అఖండ పండితులునైన పేరి పేరయశాస్త్రి దగ్గర నైషద కావ్యం ఆరు నెలల్లో పూర్తి చేసి అనర్గళంగా అప్పగించారు. మౌల్వీ బిరుదు పొంది 50కి పైగా గ్రంథాలు రచించి ‘‘ది ఇంటర్నేషల్ అకాడమీ ఆఫ్ అమెరికా’’వారిచే ‘‘డాక్టర్ ఆఫ్ లిటరేచర్’’ పట్టా పొందారు. వజ్రానికి గల అన్ని కోణాల్లో తేజస్సు ఉన్నట్టుగా ఆన్ని రంగాలలో ఎనలేని ప్రతిభ కనబరిచిన బ్రహ్మర్షి వారి రచనల ద్వారా, ప్రసంగాల ద్వారా స్వాతంత్య్ర సమర శంఖం పూరించి కలాన్నే కత్తిగా దూసిన గొప్ప ధీశాలి. అటువంటి మహోన్నత మూర్తి యొక్క 140వ జయంతి వేడుకల్లో పాల్గొని సద్గురువర్యుల ఆశీస్సులు పొందాలని పీఠం తరపున ఆహ్వానం పలుకుతున్నామన్నారు.

previous post