- పల్లకీ మోసిన పోలీసులు, భక్తులు
- భక్తులతో కిక్కిరిసిన ఉప్పాడ సెంటర్
పిఠాపురం : మహాశివరాత్రి పురస్కరించుకుని నిర్వహించే రథోత్సవంలో భాగంగా గురువారం సాయంత్రం శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వరస్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి ఆలయంలో అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయంలో నాకబలి, దండాడిరపు, దొంగలదోపు ఉత్సవములు నిర్వహించారు. అనంతరం ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకీ మీద ఏర్పాటు చేయగా స్థానిక పోలీసులు, భక్తులు, ఆలయ అధికారులు పల్లకీని తమ భుజాలపై మోస్తూ… ఊరేగింపుగా పురవీధుల గుండా స్థానిక శ్రీకుంతీ మాధవ స్వామి కోనేరు వద్దకు తీసుకువచ్చారు. అక్కడ సర్వాంగ సుందరంగా విధ్యుత్ దీపాలతో, పూల మాలలతో ఆలంకరించి రథోత్సవానికి ఏర్పాటు చేసిన రథంలోకి స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ట చేశారు. ఊరేగింపులో భాగంగా ఏర్పాటు చేసిన గరగనృత్యాలు, వివిధ రకాల వేషధారణలు, బ్యాండ్‌మేళం, బాజా భజంత్రిల నడుమ కన్నుల పండువగా ఊరేగింపు సాగింది. రథాలపేట మీదుగా ఉప్పాడ సెంటర్ దాకా రథాన్ని భక్తులు ఉరేగింపుగా తీసుకువచ్చారు. భక్తుల దర్శనార్థం స్వామి వారి రథాన్ని ఉప్పాడ సెంటర్‌లోనే నిలిపారు. జిల్లా కలెక్టర్ షన్‌మోహన్ సగిలి, జిల్లా ఎస్పి బిందు మాధవ్ ఆదేశాలతో, ఏఎస్పి దేవరాజ్ మనీష్ పాటిల్ నేతృత్వంలో పట్టణ సిఐ జి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు, ప్రత్యేక బలగాల మధ్య భారీ బందోబస్తు నడుమ స్వామి వారి రథోత్సవం నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించడానికి విచ్చేసిన అశేష జనంతో ఉప్పాడ సెంటర్ కిక్కిరిసిపోయింది. ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన బాణాసంచా చూపరులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.