- నగర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి
- పౌర సంక్షేమ సంఘం
కాకినాడ : కాకినాడ వివేకానంద పార్కు, బోటు క్లబ్ పార్కు, అన్నమ్మ ట్యాంక్ పార్కు చెరువుల్లో బోటు షికారు నిర్వహణ ఏర్పాట్లు చేపట్టాలని కార్పోరేషన్ ప్రత్యేకాధికారిని పౌర సంక్షేమ సంఘం కోరింది. గతంలో ప్రమాదాలు జరగడం వలన బోటు షికారు నిర్వహణ నిలిపివేసిన విషయాన్నిపేర్కొన్నారు. పటిష్టమైన నిర్వహణ ఏర్పాట్లు వుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదన్నారు. పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక చర్యలు వహిస్తే నగర ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందన్నారు. పార్కుల్లో షటిల్, బ్యాడ్ మింటన్, వాలీబాల్ కోర్టులు నడపడం సుప్రీం కోర్టు ఆదేశాలకు పూర్తి వ్యతిరేకం అయినప్పటికీ అన్ని పార్కుల్లోనూ ఇష్టారాజ్యంగా నిర్వహణ జరుగుతున్న పరిస్థితులను అధ్యయనం చేసి తగిన క్రీడా మైదానాలను కొత్తగా ఏర్పాటు చేయాలన్నారు. పార్కులను ఉద్యానవనాలుగా అభివృద్ధి చేయాలని కోరారు. మైదానాల్లో ప్రాక్టీస్ చేయాల్సిన రన్నింగ్ ను పార్కుల్లో కొనసాగిస్తున్న తీరు వలన సీనియర్ సిటిజన్స్, హృద్రోగులు, మహిళలు ఇబ్బందులు చెందుతున్నారన్నారు. అన్నమ్మ ట్యాంక్ పార్కు ఆవరణలో పూర్తి స్థాయిగా విద్యుత్ దీపాలు, గ్రీనరీ నిర్వహణకు నిధులు కేటాయించాలన్నారు. పార్కుల అభివృద్ధికి తీరంలోని పారిశ్రామిక సంస్థలకు దత్తత ఇచ్చే ప్రక్రియ చేపట్టాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.