కొన్ని రచనలు నిశ్శబ్దాన్ని పెక్కటిల్లేలా చేస్తాయి,ఇంకొన్ని రచనలు శబ్దం లేకుండా ప్రశ్నిస్తాయి,కానీ మన రచన గారి రచనలు మాత్రం,స్నేహం లా లాలిస్తూ తోడుగా నిలబడినట్టే నిజాయితీగా నిలదీస్తాయి,కన్నెర్ర చేసినా మాటలో మాత్రం తీయదనం చూపిస్తూ,సున్నితంగా ప్రశ్నిస్తాయి,ఆమె మనసు లానే ఆమె రచనలు కూడా మౌనంగా,సుమశయంగా,
సౌందర్యంగా,వినసొంపుగా, వినయంగా ఉంటాయి…
కొన్ని అక్షరాలు నలుదిక్కులను భయపెట్టిస్తాయి,కొన్ని అక్షరాలు కొత్త రంగులు అద్దుకుని కవ్విస్తాయి,కొన్ని అక్షరాలు నిక్కచ్చిగా నిజాయితీగా నిలబడతాయి,సమాజం కోసం, మారుతున్న స్థితిగతుల కోసం, పట్టించుకోని నాయకుల కోసం,ప్రశ్నిస్తూ,ప్రజల ప్రశ్నలకు సమాధానం వెతుకుతూనే ఉంటాయి.
మేధావులు – పదవులు
మరణాలు – మారణ హోమాలు
ఖైదీలు – జైళ్లు
సమస్యలు – సంపదలు
ఆత్మహత్యలు – దోపిడీలు
పిల్లలు – ముసలివాళ్ళు
జరిగే అక్రమాలు,అన్యాయాలు, అన్నిటినీ ప్రశ్నిస్తూ,నిలదీస్తూ
సమాజ మార్పు కోసం యువ కవయిత్రి రచన చేస్తున్న రచనలు అమోఘం…
ఇక కవిత్వం విషయానికి వస్తే
*******
శీర్షిక : నా దేశరక్షణ – నా బాధ్యత
భారతదేశం నా మాతృభూమి ..అని
ప్రార్ధన చేసే బడి పిల్లల నుంచి..
సామాన్య ప్రజల బాగోగులు చూసుకుంటాను.. అని ప్రమాణం చేసే
రాజకీయవేత్తలు వరకు.. అందరూ భారతీయులే
దేశ ప్రగతి పౌరులే..
మారేదీ.. సమస్యలకా? సంపదలకా?
మనిషికి మనిషే ద్రోహం చేస్తున్నాడు..
పంట పండించే రైతు ఆత్మహత్యలు
ఉగ్రవాదుల దాడికి బలైన
సామాన్య ప్రజలు..
పసిపిల్లల జనన ధృవీకరణ నుంచి
పండు ముసలివాళ్ళ పెన్షన్ల వరకు
జరిగే లంచాల దోపిడీలు..
పథకాలు ప్రవేశం అంటూ
ప్రజల ఓటును ,నోటుతో కొనే
రాజకీయనాయకులు..
ఒకటేమిటి …!..
ప్రతి పదవుల పెదవులు ప్రజలను
పని అనే పేరుతో అన్యాయం చేస్తున్నారు .
దేశాన్ని ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా..
అని అన్న మేధావుల మాటల్లో
దేశ సొమ్ము కోసం మంచిని కాదు మారణహోమాన్ని చేయాలి అనే మాటను
నియమించుకున్న తీవ్రవాదులు ఎందరో..
దేశ జనాభా సంఖ్య పెరగడంతోపాటు..
జైలులో ఖైదీల సంఖ్య కూడా పెరుగుతంది..
సమాజం మారాలి అనుకుంటే
ముందు మనిషి యోచన మారాలి..
మానవత్వం మేలుకోవాలి..
దేశ పౌరులుగా- దేశ రక్షణ మా బాధ్యత..
రచయిత : డి.రచన
*******
నా మాతృభూమి, నా పుట్టినిల్లు అని ప్రమాణాలు చేసే బడి పిల్లలనుంచి రాజకీయ వేత్తల వరకు అందరూ భారతీయ పౌరులే…
ప్రతిజ్ఞలు చేస్తూ, ప్రమాణాలు చేస్తూ మారుతున్న మనిషి – జీవన సమస్యల కోసమా..!? సంపదల కోసమా..!?
అంటూ సమాజం మారుతున్న తీరుపై రచయిత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు….
నలుగురికి మూడు పూటలా కడుపు నింపుతున్నందుకు కాబోలు రైతన్న ఆత్మహత్య చేసుకుంటున్నాడు,
ఏం పాపం చేశారు మనుషులుగా పుట్టడమా ఉగ్రవాదుల చేతుల్లో బలవుతున్న సామాన్య ప్రజలు…
ఒక్కటేమిటి అనేకానేకాలుగా
పుట్టిన బిడ్డల జనన ధ్రువీకరణ పత్రాల నుంచి ముసలి వాళ్లు తీసుకునే పెన్షన్ల వరకు లంచాలు తీసుకునే అధికారులు, పథకాల పేరిట జనాలను మాయలో ఉంచుతూ వారి ఓట్లను నోట్ల కట్టలతో కొంటున్నాడు ఒక రాజకీయ నాయకుడు….
సామాన్యుడికి సంపాదన ఎంతో అవసరం దానికి మార్గం పని, ఉద్యోగం పేరుతో పదవుల పెదవులు ప్రజలను అన్యాయం చేస్తున్నా, దోపిడీలకు,దారుణాలకు పాల్పడుతున్న తీవ్రవాదులకు నీతి సూక్తులు బోధపడతాయా, మారణహోమాన్ని జయించకుండా వారి చేతులకు సంకెళ్లు వేయగలమా…
జనుల సంఖ్యతో పాటు నేరాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది సమాజం మారాలి అనుకుంటే ఆలోచన అవసరం మానవత్వం మరింత అవసరం దేశ పౌరులుగా మన బాధ్యత దేశ రక్షణ మన బాధ్యత….
కూలీగా బ్రతికినా, కోట్లకు వారసులు అయినా, బంగళాల్లో బతికినా, పూరి గుడిసెలో పుట్టినా, భారత పౌరుడే…
భారత పౌరుడి సమాజాన్ని జాగృతి చేసుకోవలసిన బాధ్యత మనందరిపై ఉంది, దేశ ప్రగతి ఆకాశాన నిలబెట్టాల్సిన అవసరం లేదు, అడుక్కునేవాడు భూమిపై లేకుండా చేయగలిగితే చాలు, అదే మన దేశ ఔన్నత్యం అంటూ చాకచక్యంగా రచయిత చెప్పకనే చెప్పారు….
నిజమే కొన్ని అక్షరాలు వేవేల భావాలను పలికిస్తాయి, నిజమే కొన్ని అక్షరాలు అల్లకల్లోలం అవుతున్న మనసుకి ఊరటనిస్తాయి, నిజమే ఇంకొన్ని అక్షరాలు దేశ ఔన్నత్యం కోసం పాటుపడుతూనే ఉంటాయి, మన యువ కవయత్రి రచన గారి అక్షరాలు కూడా సమాజ మార్పు కోసం జనులకు హితబోధ చేస్తూనే ఉంటాయి, ప్రజాతీతం, పురుషాధిక్యత, ప్రగతి పదం వైపు అడుగులు వేస్తూ మీ కలాన్ని కదిలిస్తూ మరెన్నో కవనాలు సృష్టిస్తూ ఉండాలని, అందరిని అబ్బురపరచే మీ రచనలు తారాజువ్వలా ఆకాశాన్ని అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ….
*****
సమీక్షకురాలు : పోలగాని భానుతేజశ్రీ
కృష్ణాజిల్లా