స్త్రీలకు అన్ని రంగాలలో సామాజిక సమానత్వం సాధించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. మంగళవారం ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఐద్వా ఆధ్వర్యంలో చేపట్టిన పూలే అంబేద్కర్ యాదిలో మహిళ హక్కుల పరిరక్షణ యాత్ర హైదరాబాదులో ప్రారంభమై సూర్యాపేట జిల్లా కేంద్రముకు రాత్రి చేరుకుంది. ఈ యాత్రకు ఐద్వా సూర్యాపేట జిల్లా కమిటీ, ఎస్ఎఫ్ఐ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కెవిపిఎస్ సంఘాల నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఘన స్వాగతం పలికారు. మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం నుండి రైతు బజారులోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు పెరిగాయని ఆరోపించారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పనలో ఇంకా స్త్రీలు వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు. మహిళలు, విద్యార్థులపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలను అరికట్టడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని అన్నారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఓటిటీ, వెబ్ సిరీస్ లు, పోర్న్ వెబ్సైట్లను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి మాట్లాడుతూ దేశంలో గంజాయి, మారక ద్రవ్యాల విక్రయాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రతిష్టం చేసి కేరళ వామపక్ష ప్రభుత్వం తరహాలో16 రకాల నిత్యవసర వస్తువులను అందించాలన్నారు. కులాంతర వివాహితులకు రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన గేయాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తంగేళ్ల వెంకటచంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శిలు ఆశలత, భారతి, షబానా, స్వరూప, నర్మద, ఐద్వా జిల్లా కార్యదర్శి మద్దెన జ్యోతి, ఐద్వాజిల్లా నాయకురాలు పిండిగా నాగమణి, షేక్ ఖాజాబీ, రమాదేవి, చెరుకు ఏకలక్ష్మి, కొప్పుల రజిత, సృజన, మంగమ్మ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జున రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షాప్రధాన కార్యదర్శి ములకలపల్లి రాములు, సిఐటియు మాజీ జిల్లా కార్యదర్శి కోలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్, ప్రైవేటు ఉపాధ్యాయుల సంఘం జిల్లా కన్వీనర్ జిల్లా పల్లి నరసింహారావు, ప్రజానాట్యమడలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.