తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ మీడియా లో కొనసాగుతున్న సుమారు 40 వేల మంది జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో జూలై నెల 21వ తేదీన హైదరాబాద్ మహానగరంలో నిర్వహించబోయే హలో జర్నలిస్టు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని యూనియన్లకు అతీతంగా ప్రతి జర్నలిస్టు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టులను ప్రభుత్వాలు విస్మరించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.జర్నలిస్టుల పైన సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారని యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా జారీ చేయాల్సిన అక్రిడేషన్ల గడువు పూర్తయి ఏడాది దాటినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం ఆ ఊసు ఎత్తకపోవడం విచారకరమన్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు పోలీస్ భరోసా కార్డులు అన్ని ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా హెల్త్ కార్డులు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో జర్నలిస్టుల ఆత్మగౌరవ భవనాలు ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలని కోరారు. జర్నలిస్టులు వేరువేరుగా ఉండి ఐక్యమత్యం లేకపోవడంతోనే ప్రభుత్వాలకు అలుసుగా మారిందని ఈ విషయాన్ని అన్ని యూనియన్ కమిటీ సభ్యులు గుర్తు చేసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో అన్ని కులాలకు అన్ని సౌకర్యాలతో కూడిన పక్క భవనాలు ఉన్నాయన్నారు.కేవలం జర్నలిస్టులకు మాత్రమే నిలువ నీడ లేకుండా పోయిందని ఇందుకు కారణం జర్నలిస్టులలో ఐక్యమత్యం లేకపోవడమేనని ఇకనైనా ప్రతి జర్నలిస్టు తమ సమస్యల పరిష్కారం కోసం అన్ని యూనియన్లు ఐక్యమత్యంతో ఉండి ప్రభుత్వంపై ఉద్యమించాడానికి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గట్టిగుండ్ల రాము, రాష్ట్ర నాయకులు రాకేష్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొండా శ్రీనివాస్ ,హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అలీం పాషా, ఇతర జర్నలిస్టు యూనియన్లకు సంబంధించిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
