ధాన్యం సేకరణ పై బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ కలెక్టర్ కార్యాలయంలో రైస్ మిల్లర్లు, పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మిల్లర్లు ప్రతిరోజు మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లు కొనుగోలు చేయాలని, మిల్లర్లకు ప్రభుత్వం తరఫున అవసరమైన పూర్తి సహాయ, సహకారాలు ఇస్తామని తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా పూర్తిగా సహాయ సహకారాలు అందించి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేవలం 10 శాతం బ్యాంకు గ్యారెంటితో ప్రభుత్వం ధాన్యాన్ని మీల్లులకు కేటాయిస్తున్నదని, అంతేకాక మిల్లింగ్ చార్జీలు పెంచడం వంటి అన్ని రకాల సహాయ, సహకారాలను మిల్లర్లకు అందిస్తున్నదని, అందువల్ల ప్రభుత్వం ఇస్తున్న చేయూతను దృష్టిలో ఉంచుకొని, మిల్లర్లు ముందుకు వచ్చి రైతులకు, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
అధికారులతో సమీక్షిస్తూ మిల్లుల వద్ద ధాన్యం ఎక్కువ రోజులు ఉండడానికి గల కారణాలు, వివరాలను తెలుసుకున్నారు. రైతులు అమ్మిన ధాన్యం డేటా ఎంట్రీ ఆలస్యం అవుతుందని తెలుసుకొని ఎప్పటికప్పుడే డేటా ఎంటర్ చేయాలని, ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం మొత్తం గురువారం మధ్యాహ్నం లోగా ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ధాన్యం అమ్మిన రైతులకు చెల్లింపులు సైతం వెంటనే చేయాలని అన్నారు. అవసరమైతే కార్యాలయ పని వేళల తర్వాత సిబ్బంది పనిచేసి డేటా ఎంట్రీ, చెల్లింపులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మిర్యాలగూడ డివిజన్ లో ఎక్కువగా ధాన్యం వస్తున్నందున అక్కడ వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు.
ఇందుకు రైస్ మిల్లర్లు అంగీకరిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.
*జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పవర్ పాయింట్ ప్రజెంటేషన్* నల్లగొండ జిల్లాలో ఈ వానకాలం ధాన్యం సేకరణలో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన దాన్యం, ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం ,చెల్లింపులు, తదితర వివరాలను తెలియజేశారు . ఇప్పటివరకు 160 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని ,4048 మంది రైతులకు 52 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశామని, మరో 50 కోట్ల రూపాయలు రెండు రోజుల్లో చెల్లించనున్నామని తెలిపారు. వచ్చేవారం ఇంకా ఎక్కువ మొత్తంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున ,ఐకెపి, పిఎసిఎస్ తదితర సంస్థలు పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాలని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, ధాన్యం కొనుగోలు చేసే కేంద్రాల ఏజెన్సీలు ప్రతిరోజు నాణ్యత ప్రమాణాలు వచ్చేలా చూడాలన్నారు. మిర్యాలగూడ ప్రాంతంలో అత్యధిక సామర్థ్యం ఉన్న మిల్లులు ఉన్నాయని, అయితే రోడ్లపై ధాన్యం లారీలు ట్రాక్టర్లు ఆగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైస్ మిల్లులదేనని అన్నారు.
మిర్యాలగూడ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటివరకు తాము 2,83,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, రోజుకు 30000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంటున్నామని, వర్షం ఎక్కువగా ఉన్నందున తేమశాతం ఎక్కువగా వస్తున్నదని, మిల్లుల కెపాసిటి ఉన్నంతవరకు నూటికి నూరు శాతం సామర్థ్యంతో కొంటున్నామని, అయితే మిల్లుల వద్ద ఎక్కువ ధాన్యం నిలిచిపోకుండా వారానికి ఒకరోజు లేదా రెండు రోజులు హార్వెస్టింగ్ హాలిడే ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జై వీర్ రెడ్డి ,అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల డిఎం హరీష్ , జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, జిల్లా సహాకార శాఖ అధికారి పత్యా నాయక్, మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు .