నిమోనియా బారిన పడి ఎనిమిదేళ్ల బాలుడు మృతిచెందిన సంఘటన గజ్వేల్ మండల పరిధిలోని దాతర్ పల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన జూపల్లి బాలయ్య, సంతోష దంపతులకు ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు ధనుష్ (8) అనే బాలుడు గత పది రోజులుగా నిమోనియాతో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం బాలుణ్ణి మొదటగా గజ్వేల్ పట్టణంలోని ఏబీసీ ఆసుపత్రిలో, అనంతరం రెయిన్బో ఆసుపత్రిలో చూపించగా నిమోనియా తగ్గకపోవడంతో నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతిచెందాడు. కాగా బాలుడు గజ్వేల్ పట్టణంలోని గీతాంజలి పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు.