అభివృద్ధి లో అందరూ భాగస్వామ్యులు కావాలని, సూర్యాపేట పట్టణంలో శాంతియుత వాతావరణంలో ఇప్పటి మాదిరిగానే ప్రజలు మున్ముందు కూడ అందరూ కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించాలని, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు జరిగిన సూర్యాపేట మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో ఆయన పాల్గొని పదవి కాలం ముగింపు సందర్భంగా కౌన్సిలర్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల కాలంలో సూర్యాపేట మున్సిపాలిటీకి పెద్దఎత్తున నిధులు తీసుకుని వఛ్చి అభివృద్ధి చేసినట్లు చెప్పారు. సూర్యాపేట పోరాటాల గడ్డ అని, ఇక్కడ వ్యాపారులు కూడ పోరాటాలలో పాల్గొన్న చరిత్ర వుందని, ఆ చైతన్యంతోనే దళిత మహిళను మున్సిపల్ చైర్మన్ గా నియమించామని అన్నారు.
గతంలో సద్దల చెరువు ను మినీ ట్యాంక్ బండ్ గా నిర్మాణం చేసుకున్నామని, పుల్లారెడ్డి చెరువు వద్ద పనులు పూర్తి కాలేదని, అలాగే నల్లచెరువు వద్ద కూడ మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం చేయడానికి సూర్యాపేట ఎమ్మెల్యే గా తనవంతు కృషి చేస్తానని అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ కార్మికులు, సిబ్బంది మెరుగైన పనితీరుతోనే మున్సిపాలిటీ కి జాతీయ స్ధాయి అవార్డులు వఛ్చాయని, ఇదే స్పూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించి, పట్టణ అభివృద్ధి లో శాంతి భద్రతలను కాపాడడంలో సమన్వయంతో కలిసిమెలిసి పనిచేయాలని అన్నారు. *వాడివేడిగా మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం*
పట్టణంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ లు ప్రశ్నించారు. బస్తీలలో నీటి సరఫరా ను మెరుగు పరచాలని, పేదలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని పలువురు కౌన్సిలర్ లు మున్సిపల్ చైర్ పర్సన్ మరియు కమీషనర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, 42 వ వార్డు కౌన్సిలర్ అంగిరేకుల రాజశ్రీ మాట్లాడుతూ మిషన్ భగీరథ నీటి సరఫరా పెంచాలని, అనేక మార్లు కౌన్సిల్ సమావేశంలో చెప్పినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు.అనంతరం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఫ్లోర్ లీడర్ లు, కౌన్సిలర్ లతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు.