మోతే: మోతే మండల పరిధిలోని రావి పహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న ప్రజల ప్రాణాలను మంటగలిపి, పంట పొలాలను బీడి భూములుగా మార్చేఎన్ఎంకె ఇథనాల్ కంపెనీ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు నాయకత్వంలోని 8 మందితో కూడిన బృందం శుక్ర, శని వారాలలో 25 కిలోమీటర్లు మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గత కొన్ని రోజులుగా మోతే మండలం రావి పహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న ఎన్ఎంకె ఇథనాల్ కంపెనీ నిర్మాణ పనులు వెంటనే ఆపివేయాలని కంపెనీ నిర్మాణానికి ఇచ్చిన పర్మిషన్లు రద్దు చేయాలని ఆందోళన నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా సిపిఎం పార్టీ మోతే మండల కమిటీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ మహా పాదయాత్రను సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఈ పాదయాత్రలో ఇథనాల్ కంపెనీ నిర్మాణం మూలంగా సర్వం కోల్పోతున్న కోటపహాడ్, రావి పహాడ్, శెట్టి గూడెం, కూడలి, సర్వారం, బురకచర్ల, అప్పన్న గ్రామాలలో పాదయాత్ర జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో సభలు సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ మహా పాదయాత్రకు పార్టీ శ్రేణులు, బాధిత గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.