వరంగల్ జిల్లా స్థాయి ఇన్స్పైర్ మరియు విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నర్సంపేటలోని శివాని పబ్లిక్ స్కూల్లో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిర్వహించనున్న సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధ్యక్షత వహించారు.
ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు బసవరాజ్ సారయ్య, అలుగుబెల్లి నర్సిరెడ్డి ,వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధికి, వనరుల పెంపునకు సైన్స్ దోహధం చేస్తుందన్నారు. సైన్స్ ఫెయిర్ లాంటి ఎగ్జిబిషన్లు నిర్వహించడం వల్ల విద్యార్థులలోని సృజనాత్మకత వెలుగులోకి వస్తుందన్నారు.
బాలలు అనారోగ్యం బారిన పడకుండా సేంద్రీయ వ్యవసాయం ద్వారా తయారైన ఆహారం తినాలని తెలిపారు. భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశమని,నూతన టెక్నాలజీని విద్యార్థులు ఆవిష్కరించి భావి శాస్త్రవేత్తలుగా తయారై ఉత్పత్తిని పెంపొందించే పనిముట్లు, వంగడాలను కనిపెట్టాలని కోరారు. అబ్దుల్ కలాం లాంటి శాస్త్రవేత్తలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ విషయాల పైన ఆసక్తి పెంపొందించుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాస్త్ర సాంకేతికతపైన విద్యార్థులకు సైన్స్ ఎగ్జిబిషన్లు, ఇన్స్పైర్ కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంస నీయమన్నారు. సైన్స్ ఫెయిర్ వలన విద్యార్థులలోని ప్రతిభాపాటవాలని వెలికి తీయవచ్చని, వారిలో నైపుణ్యాలను పెంపొందించడానికి సైన్స్ ఫెయిర్ ఒక మంచి అవకాశం అని తెలిపారు.
ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, సైన్స్ ఫేర్ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లోని అంతర్గత నైపుణ్యాల వెలికిలోకి వస్తాయన్నారు.
పాఠశాలల్లో కూడా తాము నేర్చుకున్న విషయాల పైన మిగతా విద్యార్థులకు తెలియజేయాలని కోరారు. భారతదేశ అభివృద్ధి, శాస్త్ర సాంకేతికత వల్లనే సాకారం అవుతుందన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండే శాస్త్రీయ విషయాలపైన ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి , వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్, జిల్లా పరిషత్ సీఈవో రాం రెడ్డి, సిపిఓ గోవిందరాజన్, ఆర్ డి ఓ పి. ఉమారాణి, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, కాలేజీయేట్ ఎడ్యుకేషన్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ నవీన్, జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్, దుగ్గొండి తహసిల్దార్ రవిచంద్ర రెడ్డి,
జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు కొల్లూరి ఫ్లోరెన్స్, ఉండ్రాతి సుజన్ తేజ, కె. సుభాష్, నర్సంపేట ఎంఈఓ కొర్ర సారయ్య,
శివాని పబ్లిక్ స్కూల్ మోతే సమ్మిరెడ్డి, కరస్పాండెంట్ రాహుల్ వర్మ, ట్రస్మా నాయకులు నాగార్జున రెడ్డి, రమేష్, నిర్వహణ కమిటీ సభ్యులు పట్టాభి,వివిధ కమిటీల బాధ్యులు, ప్రెస్ కమిటీ కన్వీనర్ ఎల్ సుధాకర్ రావు, కో కన్వీనర్ పిన్నింటి బాలాజీ రావు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు , వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
147 ఇన్స్పైర్ ప్రాజెక్టులను, 450 కి పైగా ఆర్బివిపి ఎగ్జిబిట్లను విద్యార్థులు ప్రదర్శించారు. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు చేసిన ప్రారంభ నృత్యం వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. శివాని పబ్లిక్ స్కూల్ విద్యార్థులు స్వాగతం నృత్యాన్ని చేశారు. మొదటిరోజు 1500 మందికి పైగా విద్యార్థులు సైన్స్ ఫెయిర్ సందర్శించారు.
27 ఉదయం 10:00 నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు సందర్శకులు వీక్షించడానికి తరలిరావాలని డీఈవో మామిడి జ్ఞానేశ్వర్, జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ కోరారు.