రెసిడెన్షియల్ హాస్టళ్లలో విద్యార్థులకు నాసిరకమైన భోజనం పెట్టినా, క్వాలిటీ లేని వస్తువులను సరఫరా చేసినా బాధ్యులతో జైలు ఊచలు లెక్క పెట్టిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ఆస్పత్రుల పాలైన ఘటనలు తాను వార్తల్లో చూస్తున్నానని,ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవం కార్యక్రమానికి సీఎం హాజరై మాట్లాడారు.గురుకుల పాఠశాలలను తక్కువ అంచనా వేయొద్దన్నారు.ఎమ్మెల్యేలు, ఎంపీలు,మంత్రులు,సీఎం ఏ సన్న బియ్యం తింటున్నారో అవే బియ్యంతో గురుకుల విద్యార్థులకు భోజనం పెట్టాలనేది మా ప్రభుత్వ సంకల్పం అన్నారు.గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.పదేళ్లుగా పెంచకుండా ఉంచిన డైట్ చార్జీలు,కాస్మెటిక్ చార్జీలను తాము పెంచామన్నారు.పదేండ్లలో 5 వేల పాఠశాలలు మూతపడ్డాయని, కానీ మా ప్రభుత్వం వచ్చాక బడ్జెట్ లో విద్యాశాఖకు నిధులు పెంచామన్నారు.ప్రజా ప్రభుత్వానికి 11 నెలలు పూర్తయిందని గురువారం నుంచే ప్రజా ఉత్సవాలను ప్రారంభి స్తున్నామన్నారు.విద్యా వ్యవస్థను బాగు చేయడానికి విద్యాకమిషన్ ఏర్పాటు చేశామన్నారు.నాడు కేసీఆర్ మనువడు పెంచుకున్న కుక్కపిల్ల చనిపోతే డాక్టర్లను జైల్లో వేశారని, కానీ గురుకులాల్లో పిల్లలు చనిపోతే కనీసం పట్టించుకోలేదని విమర్శించారు.త్వరలోనే యూనివ ర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు.విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉంటామని ప్రమాణం చేయాలని సూచించారు.