సూర్యాపేట:దేశవ్యాప్తంగా జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ జూలై 3న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జిల్లా సదస్సు నిర్వహిస్తున్నామని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన ప్రజా సంఘాల జిల్లా బాధ్యుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వేగవంతంగా అమలు చేయాలని భావిస్తున్నదని అన్నారు. అందులో భాగంగానే కార్మిక వర్గం పోరాటం చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయాలని వేగవంతం చేస్తున్నదని ఆరోపించారు.ఇది అమల్లోకి వస్తే భారత కార్మిక వర్గం త్యాగాలతో సాధించుకున్న హక్కులన్నీ, హరించబడతాయని, కార్మికులకు ఎలాంటి చట్టాలు హక్కులు లేకుండా చేసి కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టాలని బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వీటితోపాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేటీకరణకు అప్పగించి కార్పొరేట్, పెట్టుబడిదారులకు ప్రయోజనం కలిగించే విధంగా లేబర్ కోడ్లలో వారికి అనుకూలంగా చట్టాలను మార్చడం జరిగిందన్నారు.నాలుగు లేబర్ కోడ్ లో పారిశ్రామిక సంబంధాల కోడ్ వేతనాల కోడ్ వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ సామాజిక భద్రత కోడ్లుగా రూపొందించారని ఉన్నారు.ఇందులో కనీస వేతన నిర్ణయాన్ని ప్రభుత్వాల యాజమాన్యాల దయ దక్షిణాన వరకు వదిలేశారని అన్నారు. నాలుగు లేబర్ కోడ్లు అమలు అయితే కార్మికులు కార్మిక సంఘలు పెట్టుకునే హక్కును కోల్పోతారని చెప్పారు.కనీస వేతనాలు ప్రమాద భద్రతలు ఉద్యోగ భద్రత అడిగే హక్కులను పూర్తిగా హరించిపోతాయని అన్నారు. కార్మికులు పనిచేయాలంటే యాజమాన్యాల యొక్క దయా దక్షిణాల పైన ఆధారపడి పని చేయాల్సి వస్తుందన్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రోజురోజుకు నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం కార్మికులను నిరుద్యోగులకు ప్రయోజనం కలిగించే విధంగా కాకుండా కేవలం గుత్తాపెటబడిదారులకు, యాజమాన్యాలకు ప్రయోజనం కలిగించే విధంగా ఈ చట్టాలను తీసుకొస్తా ఉందన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ భారతదేశంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ జులై 9 నాడు జరిగే సార్వత్రిక సమ్మెకు అన్ని ప్రజా సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయని ఈ సమయంలో కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈనెల 3న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే కార్మిక, కర్షక ఐక్యత సదస్సుకు *ముఖ్య అతిథిగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం* హాజరవుతున్నారని చెప్పారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మడ్డి అంజిబాబు, గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా నాయకులు వీరబోయిన రవి, కడెం లింగయ్య, ఉప్పుల రమేష్ పాల్గొన్నారు.