సూర్యాపేట: ఈనెల 29, 30, డిసెంబర్ 1 తేదీలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే సిపిఎం పార్టీ జిల్లా మూడవ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారంసూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాల బావి సెంటర్ లో సిపిఎం సూర్యాపేట జిల్లామూడవ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ఎర్ర బెలూన్లు గాలిలోకి వదిలి మహాసభల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట పురిటి గడ్డ అయినా సూర్యాపేట జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా మూడవ మహాసభలు జరుగుతున్నాయని అన్నారు. నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి నేటి వరకు జరిగిన అనేక ప్రజా ఉద్యమాలకు సూర్యాపేట కేంద్ర బిందువుగా నిలిచిందన్నారు.అనేక త్యాగాలకు, సామాజిక, వామపక్ష కమ్యూనిస్టు ఉద్యమాలకు నిలయమైన సూర్యాపేటలో సిపిఎం జిల్లా మహాసభలు జరుపుకోవడం మహదానందం అన్నారు. సిపిఎం జిల్లా మహాసభల సందర్భంగా నవంబర్ 29న కు డకు డరోడ్డులోని భాగ్యలక్ష్మి రైస్ మిల్ నుండి సూర్యాపేట పురవీధుల గుండా రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు మహా ప్రదర్శన నిర్వహించి గాంధీ పార్కులో వేలాది మందితో బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ బహిరంగ సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి హాజరవుతున్నారని తెలిపారు. ఈ మహాసభల విజయవంతం కోసం సూర్యాపేట జిల్లా ప్రజలు ఆర్థిక,హార్దిక సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టి పెళ్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మి,సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, జిల్లపల్లి నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, మేకన బోయిన శేఖర్, చిన్నపంగా నరసయ్య, సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్, సిపిఎం రూరల్ మండల కార్యదర్శి మేరెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.