జోగిపేటలోని ఎన్టీఆర్ స్టేడియంలో క్రీడాకారులకు అవసరమైన వసతులన్నింటిని కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం దివంగత మాజీ మంత్రి రాజనర్సింహ మెమోరియల్ క్రికెట్ టౌర్నమెంట్ ముగింపు సందర్బంగా విజేతలకు బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా హజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్ ఎ.చిట్టిబాబు అధ్యక్షత వహించారు. ఎన్టీఆర్ స్టేడియానికి ఇది వరకే రూ.2 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రహరిగోడ నిర్మాణం పూర్తయ్యిందన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమేనని అన్నారు. రాబోయే రోజుల్లో ఇదే మైదానంలో క్రికెట్ పోటీలు నిర్వహించే విధంగా మైదానాన్ని తీర్చిదిద్దుతామన్నారు. తన తండ్రి రాజనర్సింహ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన చిట్టిబాబును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం చిట్టిబాబు జన్మదినం కావడంతో మంత్రి కేక్‌ను కట్‌చేయించి ఆయనకు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
విజేతలకు బహుమతుల ప్రధానం
జోగిపేటలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు మంత్రి దామోదర్ చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. ఫైనల్‌లో అందోలు, జోగిపేటలకు చెందిన టీంలు పోటీపడ్డాయి. అందోలు జట్టు విజేతగా నిలవగా, జోగిపేట జట్టు రన్నర్‌గా నిలిచింది. మొదటి బహుమతి కింద అందోలు జట్టుకు రూ.20వేల నగదు, జోగిపేట జట్టుకు రూ.10వేల నగదుతో పాటు కప్‌తో పాటు వ్యక్తిగత మెడల్స్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీవో పాండు, డిప్యూటీ తహశీల్దార్ మధుకర్‌రెడ్డి, కౌన్సిలర్ డాకూరి శంకర్, కొ అప్షన్ సభ్యుడు అల్లె శ్రీకాంత్, సీఐ అనిల్‌కుమార్, ఎస్‌ఐలు పాండు, క్రాంతి, నిర్వహకులు హర్షద్, జీషాన్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు.