Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

అక్రిడేషస్లు ఎర!

  •  తలాడిస్తున్న జర్నలిస్టులు

 

  •  ‘దందా’ గుప్పిట్లో సమాచార ఉద్యోగి

 

కాకినాడ : ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన జర్నలిస్టు అనిపించుకోవాలంటే ఖచ్చితంగా అక్రిడేషన్ కార్డు అవసరం. అక్రిడేషన్ కార్డుతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అన్న విషయాన్ని పక్కనబెడితే… ఆ కార్డు పేరు చెప్పి ఇప్పటికీ దందా జర్నలిస్టులు కాకినాడలో కొంత మంది జర్నలిస్టులను తమవైపుకు తిప్పుకుంటున్నారు. దందా జర్నలిస్టుల మాట కాదని- ఒకడుగు ముందుకేసిన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు కట్ అంటే నమ్ముతారా…నమ్మక తప్పదు. కాకినాడలో గత కొన్నేళ్ళుగా దందా జర్నలిస్టులు ఈ రకంగా దందాలు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్నారు. ప్రముఖ పత్రికలు, ఛానళ్ళలో పనిచేసే కొంత మంది జర్నలిస్టులు సైతం దందా జ(ఎ)ర్నలిస్టులు పేరు చెబితే వణికిపోతున్నారు. దందా జర్నలిస్టులు ఏమి చెబితే దానికి తలాడిస్తూ లైన్ క్లియర్ చేసుకుని అక్రిడేషన్ కార్డులు పొందుతున్నారు. అవసరమైతే జర్నలిస్టుల మద్య విభేదాలు సృష్టించి కొత్త క్లబ్ లను తెరమీదకు తీసుకొచ్చి పబ్బం గడుపుకుంటున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. అక్రిడేషన్ కార్డులు పొందడంతో పాటుగా నెలవారీ మా మూళ్ళు కోసం దందా జర్నలిస్టులతో చేతులు కలిపి మేమే రారాజులమని కొంత మంది జర్నలిస్టులు విర్రవీగుతున్నారు. దందా జర్నలిస్టులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న సమాచార శాఖలోని ఒక ఉద్యోగి కూడా అక్రిడేషన్ కార్డుల విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. దందా జర్నలిస్టులు ఎవరికి సిఫార్సు చేస్తే వారికి మాత్రమే అక్రిడేషన్ కార్డులు వచ్చే విధంగా ఆ ఉద్యోగి సైతం తమ విధి నిర్వహణను విస్మరించి గడ్డికరుస్తున్నాడు. నిబంధనలకు విరుద్దంగా కొన్ని పత్రికలకు, యూ ట్యూబ్ చానళ్ళకు సైతం అక్రిడేషన్ కార్డులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో దందా జర్నలిస్టులు, సమాచార ఉద్యోగి మద్య రూ. లక్షల్లో చేతులు మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు.

జర్నలిస్టులుగా పనిచేయని వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో లంచాలు మెక్కి ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన జర్నలిస్టులుగా అక్రిడేషన్ కార్డులు జారీ చేస్తున్నారు. చెప్పుకుంటూ పొతే ఇటువంటి కార్డులు ఎన్నో ఉన్నాయి. యాజమాన్యాలు ఎవరి పేరు సిఫార్సు చేస్తే వారికి మాత్రమే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తామని సమాచార శాఖ కీలక ఉద్యోగి ఒకరు చెబుతున్నారు. అయితే ఆ లిస్టులో ఉన్న వారు ఆయా ప్రాంతాలలో జర్నలిస్టులుగా పనిచేస్తున్నారా? లేదా? అని ఒకటికి రెండు సార్లు చూసుకోవల్సిన బాధ్యత కూడా సంబంధిత సమాచార శాఖ పైనే ఉంది. ఇదేమి లేకుండా మామూళ్ళు ఇస్తే చాలు అక్రిడేషన్ కార్డులు జారీ చేసేస్తున్నారు. ఈ తతంగాన్ని తెరవెనుక నుంచి నడిపిస్తున్నది దందా జర్నలిస్టులే. ఈ వ్యవహారంలో కూడా సమాచార శాఖ కీలక ఉద్యోగి తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఏదో ఒక కుంటిసాకు చూపించి కొంత మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు రాకుండా చేస్తున్నారు. ఈ నేపద్యం దందా జర్నలిస్టులు మాట వినాల్సి వస్తుందన్న ఆవేదన, ఆందోళన కొంతమంది జర్నలిస్టుల నుంచి వినవస్తోంది. జర్నలిస్టు కాకపోయినా, అక్షరం ముక్క రాయడం రాకపోయినా పర్వాలేదు. అక్రిడేషన్ కార్డు కావాలంటే రూ.25 వేలు తక్కువ గాకుండా ముడుపులు చెల్పించుకోవల్సిందే. ఆ కార్డుతో అక్రమ వ్యాపారాలు(జర్నలిస్టు ముసుగులో) చేసుకుంటున్నారు. జర్నలిస్టు కార్డు చూపించి మీ అంతు చూస్తామని అధికారులను బెదిరించడంతో పాటుగా అనేక సందర్భాల్లో కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. కాకినాడలో జర్నలిస్టులు దందాలు ఆపుతామని, దందాలు చేస్తున్న వారి భరతం పడతామని పైకి దందా జర్నలిస్టులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దందాలు చేసి ప్రతీ ఏటా యాత్రలు చేయడం..ఆ పై జర్నలిస్టులు కాని వారికి అక్రిడేషన్ కార్డులు జారీ చేయించడం వంటివి దందా జర్నలిస్టులకు వర్తించవేమో. సమాచార ఉద్యోగికి, దందా జర్నలిస్టులకు చెక్ పెట్టకపోతే కాకినాడలో జర్నలిస్టుల పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని విలువలు కోసం పాకులాడే.. పాటుపడే ప్రతీ జర్నలిస్టు గ్రహించక తప్పదని భావిస్తున్నాము.

Related posts

భక్తి శ్రద్ధలతో శ్రీ షిరిడీ సాయిబాబా వారి 19వ ఆలయ వార్షికోత్సవం

Dr Suneelkumar Yandra

మెరుగైన ప్రజా జీవితానికి మెరుగైన మౌలిక సదుపాయాలె పునాది

TNR NEWS

నిద్రావస్థలో పిఠా‘‘పుర’’ం శానిటేషన్‌  – పట్టించుకోని అధికారులు – రోగాల బారిన ప్రజలు నానాఅవస్థలు – స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు అభ్యర్ధన

TNR NEWS

స్వచ్ఛభారత్ కు 10 సంవత్సరాలు

TNR NEWS

శాంతిస్థాపనతోనే సామాజిక న్యాయం సాధ్యం

Dr Suneelkumar Yandra

పాదగయను దర్శించిన జియో సిఈఓ

Dr Suneelkumar Yandra